గ్రీన్‌ అంబాసిడర్ల ధర్నా

Feb 6,2024 20:58

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పంచాయతీ కార్మికులకు -గ్రీను అంబాసిడర్లకు బకాయి జీతాలు చెల్లించి, వేతనాల పెంపు జిఒను అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ గ్రీన్‌ అంబాసిడర్లు మంగళవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్‌ జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రం చేసి పర్యావరణ ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు, గ్రీను అంబాసిడర్లు, గ్రీన్‌గార్డు, ్ల టైం స్కేల్‌ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కనీస వేతనాలు పెంచాలని, టెండర్స్‌ రద్దు చేయాలని, గుర్తింపు కార్డులు పిఎఫ్‌, ఇఎస్‌ఐ గ్రాట్యుటీ, పెన్షన్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి నెలా 5వ తేది లోపు జీతాలు చెల్లించాలని 2019 ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 132 స్పష్టంగా పేర్కొంటున్నా ఎక్కడా అమలు కావడం లేదన్నారు. 2 నుండి 18 నెలలు జీతాలు బకాయిలు ఉన్నాయని, వెంటనే వాటిని చెల్లించాలని కోరారు. పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు ఇస్తామని చెప్పిన జగన్‌ హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నా లో యూనియన్‌ అధ్యక్షులు జి.శ్రీను, బి.రమణ, కామేష్‌ కార్మికులు పాల్గొన్నారు.

➡️