గ్రూప్‌-2లో నూతన సిలబస్‌

Feb 19,2024 20:31

మెటీరియల్‌ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు తదితరులు
ప్రజాశక్తి – చిలకలూరిపేట : గ్రూప్‌-2 పరీక్షల్లో నూతన సిలబస్‌గా ‘భారత సమాజం’ను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) చేర్చిందని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు తెలిపారు. అభ్యర్థులకు ఉపయోగపడేలా ఈ అంశంపై మెటీరియల్‌ను రూపొందించామని, ఉచితంగానూ ఇస్తున్నామని చెప్పారు. గ్రూప్‌-2పై స్థానిక పండరిపురంలోని ఏలూరు సిద్ధయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం అవగాహన కల్పించారు. తొలుత మెటీరియల్‌ను ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మణరావు మాట్లాడుతూ 897 పోస్టులతో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ గత డిసెంబర్‌లో జారీ అయ్యిందని, ప్రిలిమినరీ పరీక్ష తర్వాత ప్రధాన పరీక్ష ఉంటుందని చెప్పారు. ఈ నెల 25న నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలో 150 మార్కులకు 150 ప్రశ్నలుంటాయని చెప్పారు. ఇందులో భారతదేశ చరిత్రపై 30 ప్రశ్నలు, జాగ్రఫీపై 30 ప్రశ్నలు, కరెంట్‌ అఫైర్స్‌, మెంటల్‌ ఎబిలిటీపై 30 ప్రశ్నలు ఉంటాయని వివరించారు. నూతనంగా చేర్చిన భారత సమాజం అంశంపైనా 30 ప్రశ్నలు ఉంటాయన్నారు. ఇది కొత్త సబ్జెక్ట్‌ అయిన కారణంగా అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండేలా మెటీరియల్‌ను రూపొందించామని, 25 వేల మందికి ఉచితంగా అందించామని చెప్పారు. కొత్త సిలబస్‌లో భారత సమాజానికి సంబంధించిన కులం, మతం, వివాహం, జాతి, తెగ, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలకు రాజ్యాంగం కల్పించిన రక్షణలు తదితర అంశాలు ఉంటాయని వివరించారు. మెయిన్‌ ఎగ్జామ్‌ ఎన్నికల తర్వాత జూన్‌ లేదా జులైలో ఉండే అవకాశం ఉందని, దానికి సంబంధించి కూడా మెటీరియల్‌ను సమకూర్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా నాయకులు తిరుపతిస్వామి, జాఫర్‌, అభ్యర్థులు పాల్గొన్నారు.

➡️