గ్రూప్‌ – 2 పరీక్షకు సర్వం సిద్ధం

ప్రజాశక్తి – కడప ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌- 2 సర్వీసెస్‌ (స్క్రీనింగ్‌ టెస్ట్‌)ఆబ్జెక్టివ్‌ టైప్‌ పరీక్షను ఆదివారం నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 67 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 23,806 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇప్పటికే రూట్‌ ఆఫీసర్లు, లైసెన్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్‌లను నియమించారు. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి 1:30 గంటల వరకు నిర్వహిస్తారు. 17 మంది రూట్‌ ఆఫీసర్లు (జిల్లా స్థాయి అధికారులు), 67 మంది లైజన్‌ ఆఫీసర్స్‌ (మండల స్థాయి అధికారులు)లను నియమించారు. ఎక్కడా చిన్న తప్పు జరగకుండా పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసినట్లు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించారు. మారుమూల ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకునేందుకోసం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి పరీక్ష కేంద్రాలలోకి అభ్యర్థులను అనుమతిస్తారు. అభ్యర్థులు హాల్‌ టికెట్‌ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని డిఆర్‌ఒ గంగాధర్‌గౌడ్‌ పేర్కొన్నారు. సెల్‌ ఫోన్స్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించబడవన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించే ందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పటిష్ట బందోబస్తు : ఎస్‌పి కడప అర్బన్‌ : జిల్లాలో ఈనెల 25న ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించబోయే ఎపిపిఎస్‌సి గ్రూప్‌ – 2 పరీక్షకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్‌పి సిద్దార్థ్‌ కౌశల్‌ పేర్కొన్నారు. 400 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదుగురు డిఎస్‌పిలు, 14 మంది పోలీసు అధికారులు, 25 మంది ఎస్‌ఐలు, వంద మంది ఎఎస్‌ఐలు, 160 మంది కానిస్టేబుళ్లు, 80 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్లు బందోబస్తు విధుల్లో ఉంటారన్నారు. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరులోని పరీక్ష కేంద్రాల పర్యవేక్షణకు 17 రూట్‌ మొబైళ్ళు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్‌, ఇంటర్నెట్‌ షాపులు మూసి వేయాలని,144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున, పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడడం నిషేధమని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు ఉన్నా కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌ 08562-246344 కు కాల్‌ చేయాలని పేర్కొన్నారు.

➡️