ఘనంగా ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య జయంతి

ప్రజాశక్తి – భీమడోలు

ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకులు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య 143వ జయంతిని ఆయన స్వగ్రామమైన గుండుగొలనులో భోగరాజు పట్టాభి సీతారామయ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. సంషుం ఛైర్మన్‌ మామిళ్లపల్లి కాళీబాబు, కార్యదర్శి బి.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు, గ్రామస్తులు సీతారామయ్య వారసులు గుండుగొలను చెరువుగట్టుపై ఏర్పాటుచేసిన పట్టాభి సీతారామయ్య శిలా విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కాళీబాబు మాట్లాడుతూ అప్పట్లో ఆంధ్రాబ్యాంకు గుండుగొలను శాఖ కొనసాగిన సమయంలో అప్పటి బ్యాంకు జాతీయస్థాయి ఉద్యోగులు, ప్రముఖులు సీతారామయ్య స్వస్థలమైన గుండుగొలనులో విద్య, ఆరోగ్యం, వ్యవసాయాభివృద్ధికి కుటీర పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇదేవిధంగా గ్రామాభివృద్ధికి సైతం తమవంతు సహకారం అందజేస్తారని తెలిపారన్నారు. ఆయన సంస్కరణార్థం తన కాలంలో ఆయన వినియోగించిన వివిధ వస్తువులతో స్థానికంగా మ్యూజియం ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చినప్పటికీ కార్యరూపం దాల్చలేదని బ్యాంకు అధికారుల దృష్టికి తెచ్చారు. ఆంధ్రులు తమ బ్యాంకుగా చెప్పుకునే ఆంధ్రా బ్యాంకు వివిధ కారణాలవల్ల యూనియన్‌ బ్యాంక్‌గా మారిపోయిందన్నారు. అంతేకాక ఆంధ్రాబ్యాంకు వ్యవస్థాపకులు సీతారామయ్య గురించి రానున్న తరానికి తెలిసే అవకాశం ఉండదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన గురించి భావితరాలకు తెలిసేందుకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుండుగొలను శాఖ మేనేజర్‌, హెచ్‌.భవాని, సొసైటీ మాజీ ఛైర్మన్‌ వివివి.భాస్కర్‌, మాజీ ఎంపిపి సిరిబత్తిన కొండబాబు, మాజీ సర్పంచి చిట్టి రవి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

➡️