ఘనంగా భోగి వేడుకలు

Jan 14,2024 20:51

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సంక్రాంతి పండగ నేపథ్యంలో తొలిరోజు ఆదివారం భోగి పండగను జిల్లాలో ప్రజలు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ప్రతి వీధిలో భోగి మంటలు వేసి సంక్రాంతి విశిష్టతను పిల్లలకు వివరించారు. మహిళలు రంగురంగు ముగ్గులతో తమ ముంగిళ్లను తీర్చిదిద్దగా, వేకువ జామున యువత సేకరించిన కర్రలతో పోటీలు పడి మరి భోగి మంటలను వేశారు. గ్రామాలను విడిచిపెట్టి ఉద్యోగ వ్యాపార పనుల నిమిత్తం దూరంగా వెళ్లినవారు శనివారం నాడు రాత్రికి తమ తమ గ్రామాలకు చేరుకోవడంతో గ్రామాలన్నీ రద్దీగా మారాయి. రైళ్లు బస్సులతో పాటు స్థానికంగా ఆటోల్లో కిక్కిరిసి జనాలు తమ తమ వాళ్లకు చేరుకోవడంతో సందడిగా మారింది. ముందుగా తయారు చేసుకున్న భోగి పిడకలను చిన్నారులతో వేయించి ఆనందపడగా, అందరూ తమ తమ చిన్నారుల తలపై భోగి పళ్ళను వేసి వేడుకలు నిర్వహించారు. పలు గ్రామాల నుంచి ఆడపడుచులు తమ కన్నవారింటికి, అత్తారింటికి చేరుకోవడంతో సోమ, మంగళవారాలు సంక్రాంతి పండగ మరింత వేడుక పంచనుంది.ఎమ్మెల్యే ఆధ్వర్యాన…పార్వతీపురం టౌన్‌ : నియోజకవర్గ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండేలా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఉండాలని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. భోగి పండుగ సందర్భంగా ఆదివారం పార్వతీపురంలో వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ముందర గల రహదారిపై భోగిమంటను వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భోగి పండుగ శుభ సందర్భంగా కష్టాలు భోగి మంటల్లో దహింప చేసి నియోజకవర్గ ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా జీవించాలంటూ ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోను గౌరీశ్వరి, వైస్‌ చైర్మన్‌ యిండుపూరు గున్నేశ్వరరావు, కొండపల్లి రుక్మిణి, పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్‌, జెసిఎస్‌ కన్వీనర్‌ గొర్లి మాధవరావు, ఎఎంసి వైస్‌ చైర్మన్‌ వానపల్లి శంకర్రావు, పలువురు కౌన్సిలర్‌ సభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులు, సచివాలయం కన్వీనర్లు, సీనియర్‌ నాయకులు, స్టేట్‌ డైరెక్టర్లు, ఎఎంసి డైరెక్టర్లు, గహసారధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.సంప్రదాయాలను భావితరాలకు అందించాలి సీతానగరం : పండుగ సంప్రదాయాలను భావితరాలకు అందించాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు కోరారు. ఈ మేరకు ఆయన భోగి పండుగ సంబరాలను తన స్వగ్రామం బూర్జలో కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. సంప్రదాయ వస్త్ర ధారణలో ఆయన భోగి మంట వద్ద అందరితో సరదాగా కలిసి పండగ ఉత్సాహాన్ని నింపారు. పూర్వ కాలం నుండి సంప్రదాయనుగుణంగా వస్తున్న మన పండుగలకు ఎంతో విశిష్టత ఉందని, ఎన్నో ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మారుతున్న జీవన విధానంలో వీటి ప్రత్యేకతలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, రాబోయే తరాలకు సాంప్రదాయ పండుగ విధానాలను అవలంబిస్తూ తెలియజేయాల్సిన అవసరం మనందరికీ ఉందని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన పండగ వాతావరణాన్ని కలుగజేయాలని ఆయన కోరారు.

➡️