చంద్రబాబు ఎదుట బల ప్రదర్శనకు టిడిపి, జనసేన సిద్ధం

Jan 29,2024 00:16

నాయకులు, కార్యకర్తలతో ఆలపాటి సమావేశం
ప్రజాశక్తి-తెనాలి :
టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు రాక సందర్భంగా ఆపార్టీ నేతల్లో సందడి నెలకొంది. రెట్టింపు ఉత్సాహంతో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. భారీ జనసమీకరణే లక్ష్యంగా ఇప్పటికే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ శనివారం రాత్రే నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించగా, తాజాగా జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌ కూడా ఆదివారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి చంద్రబాబు పర్యటన జయప్రదం చేయాలంటూ జనసైనికులకు దిశానిర్ధేశం చేశారు. దీనికి తోడు టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, ఆలపాటికి మద్దతుగా జనసమీకరణకు సన్నాహాలు చేస్తున్నారు.టిడిపి, జనసేన పొత్తులో భాగంగా తెనాలి సీటుపై టిడిపి నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్‌ నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో జనసేన నాయకులు మనోహర్‌కు తెనాలి టిక్కెట్‌ కేటాయించారని హడావుడి చేయటం, అదే సమయంలో ఆలపాటికే టిక్కెట్‌ ఇవ్వాలంటూ టిడిపి నేతలు సమావేశం నిర్వహించటం తెలిసిందే. అదే సమయంలో ఆలపాటి కూడా అత్యవసరంగా గుంటూరులో క్యాడర్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. పైగా నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తూ ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నారు. జనసేన, టిడిపి నాయకులు ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళుతుండటంతో తెనాలి సీటు ఎవరికి కేటాయిస్తారన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగులుతోంది.

జనసేన సమావేశంలో మాట్లాడుతున్న మనోహర్‌
తెనాలిలో ఇంత జరుగుతున్నా ఇప్పటికీ తెనాలి టిక్కెట్‌ కేటాయింపుపై ఇరు పార్టీల అధిష్టానం నుంచి స్పష్టత లేకపోవటం ఆపార్టీల క్యాడర్‌ను గందరగోళంలోకి నెడుతోంది. ఈ నేపధ్యంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వడ్లమూడి క్వారీ ప్రాంతంలో పొన్నూరు నియోజకవర్గం ఏర్పాటు చేసిన ‘రా కదలిరా’ కార్యక్రమానికి వస్తున సమయంలో టిడిపి, జనసేన నాయకుల్లో మరింత హీటు పెంచింది. ఇదే సమయంలో ఎవరి సత్తా వారు చాటాలన్న తీరులో ఆలపాటి, నాదెండ్ల చంద్రబాబు సభ జయప్రదం చేయాలంటూ ఎవరికి వారు పిలుపునిచ్చారు. దీంతో ఇరు పార్టీల క్యాడర్‌ బలప్రదర్శను సిద్దమౌతున్న వాతావరణం కనిపిస్తోంది. ఎలాగైనా ఆలపాటికే టిక్కెట్‌ దక్కాలన్న నినాదంతో సభలో జోష్‌ సృష్టించే పనిలో టిడిపి నాయకులు హల్‌చల్‌ చేస్తున్నారు. మరి జనసేన కూడా తగ్దేదే లే అంటూ దూకుడు పెంచుతున్నారు. ఏది ఏమైనా ఇరుపార్టీల కార్యకర్తలు పోటాపోటీగా బలనిరూపణకు సిద్దమౌతున్న నేపథ్యంలో పరిస్థితులు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.

➡️