చంద్రబాబు ప్రభంజనాన్ని అడ్డుకోలేరు: కందుల

ప్రజాశక్తి-మార్కాపురం:  వైసిపి ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో మోసపు ఓట్లతో నెగ్గాలని వైసిపి చూస్తోందని ఆరోపించారు. అందుకు కొందరు అధికారులు అధికార వైసిపికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుల నారాయణరెడ్డి మాట్లాడారు. మార్కాపురం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసిపి పడరాని పాట్లు పడుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లు తొలగించే పనిలో నిమగమయ్యారన్నారు. కొందరు అధికారులు అందుకు సహకరిస్తున్నారన్నారు. ఓట్లను తొలగించే ముందు ఎలాంటి విచారణా చేయడం లేదన్నారు. వలస కూలీల ఓట్లు గల్లంతవుతున్నాయన్నారు. అర్హత కలిగిన వారికి ఓట్లు ఉండేలా చూడాలని కోరారు. వైసిపికి అనుకూలమైతే ఓట్లు ఉంచడం… లేకపోతే తొలగించాలనుకోవడం సరికాదన్నారు. ఆ విధంగా అధికారులు కొందరు వ్యవహరిస్తున్నారని, అలాంటి వారందరినీ గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. తుపాను కారణంగా రైతన్నలు తీరని నష్టానికి గురయ్యారన్నారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం హెలికాఫ్టర్‌లో వచ్చి వెళితే ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో రైతన్నలు దెబ్బతిన్న వివరాలు సేకరించాలన్నారు. ప్రతి రైతన్నకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రైతులకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని తాము అనుకోవడం లేదన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు 5వ గేటు గతంలో కొట్టుకుపోయిందన్నారు. దాని మరమ్మతులు ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నారు. తాజాగా 3వ గేటు కొట్టుకుపోయిందన్నారు. ఈ విధంగా నీరు సముద్రం పాలవుతోందన్నారు. ఆ ప్రాంత రైతాంగాన్ని గుండ్లకమ్మ ప్రాజెక్టు ద్వారా ఒరిగిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తేనే రైతన్నలతో పాటు అందరూ బాగుంటారని చెప్పారు. విలేకరుల సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు షేక్‌ మౌలాలి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, టిడిపి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి వెంకటసత్యనారాయణ, టిడిపి నాయకులు సయ్యద్‌ గఫార్‌, పఠాన్‌ గులాబ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️