చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన ‘గంగవరం’

ప్రజాశక్తి – ఎర్రగుంట్ల వైసిపి రెబల్‌ నాయకులు గంగవరం శేఖర్‌ రెడ్డి శుక్రవారం చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డికి సమీప బంధువైన గంగవరం శేఖర్‌ రెడ్డి 2019 ఎన్నికల్లో సుధీర్‌ రెడ్డి గెలుపు కోసం తన వంతు కషి చేశారు. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఇరువురికి బేదాభిప్రాయాలు రావడంతో సుధీర్‌ రెడ్డికి దూరంగా ఉంటూ వచ్చారు. వైసిపి పార్టీని వీడకుండా సుధీర్‌ రెడ్డిపై అసమ్మతిగా ఉన్న నేతలను కలుస్తూ వారిని ఒక్కటి చేసే ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గంలో తిరుగుతూ, అసమ్మతినేతలను కలుస్తుండడంతో సహించలేని ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి జిల్లా వైసిపి అధ్యక్షులు సురేష్‌ బాబుతో గంగవరం శేఖర్‌ రెడ్డికి వైసిపికి ఎటువంటి సంబంధం లేదు అని ప్రకటన ఇప్పించారు. దీంతో వైసిపి పార్టీకి కూడా దూరంగా ఉంటూ సొంత గ్రూపును తయారు చేసుకుంటూ వారికి అండగా ఉంటూ వచ్చారు. జమ్మలమడుగు టిడిపి ఇన్‌ఛార్జి భూపేష్‌ రెడ్డి, పులివెందుల టిడిపి ఇన్‌ఛార్జి బిటెక్‌ రవి ఆహ్వానం మేరకు వారి ఆధ్వర్యంలో శుక్రవారం” రా కదలిరా’ కార్యక్రమానికి కమలాపురానికి విచ్చేసిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకొని టిడిపిలో చేరారు.

➡️