చట్టాల పటిష్ట అమలుతోనే దాడులకు అడ్డుకట్ట : ఐద్వా

మాట్లాడుతున్న గద్దె ఉమశ్రీ, జి.రజిని
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
చట్టాలను పటిష్టంగా అమలు చేయడం ద్వారానే మహిళలపై దాడులకు, అత్యాచారాలకు, హింసకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట కమిటీ సభ్యులు గద్దె ఉమశ్రీ అన్నారు. ఐద్వా పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రజినితో కలిసి నరసరావుపేటలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. మహిళలపై దాడులకు అడ్డుకట్ట వేసేందుకు సమగ్రమైన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వానికి ఐద్వా నివేదించిన ప్రభుత్వ స్పందించడం లేదన్నారు. మహిళలు, బాలికలపై నిత్యం దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రచారార్భాటంగా చేస్తున్న దిశా చట్టం నిరుపయోగంగా ఉందని విమర్శించారు. దాడులకు అత్యాచారాలకు పాల్పడిన వారిపై తక్షణ విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు. దిశా చట్టం ద్వారా 21 రోజుల్లో దోషులకు శిక్ష వేస్తామని చెప్పారని అత్యాచారం, హత్య కేసుల్లో నేర నిర్ధారణ కాకుండా చర్యలు తీసుకోవడం కుదరదని, ఫోరెన్సిక్‌ వివరాలు రావాలంటే 6 నెలలు పడుతుందని పోలీసులు చెబుతున్నారని, ఈలోగా చట్టాలను ఉపయోగించుకుని నిందితులు సాక్ష్యాలను రూపుమాపుతున్నారని అన్నారు. శిక్షలు పడకపోవడంతో నిందితులింకా రెచ్చిపోతున్నారని, వీటన్నిటిపై ప్రభుత్వం స్పందించి చట్టాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వాతి మాస పత్రికలో వస్తున్న బూతు, పడక గదిలోని అంశాల ప్రచురణ ఆపాలని ఐద్వా ఆధ్వర్యంలో కేసు వేశామని తెలిపారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆజాదీక అమృతమహోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో సగభాగంగా ఉన్న స్త్రీలకు ఒరిగిందేమీ లేదన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో, రాష్ట్రంలో, నిరుద్యోగం, పేదరికం, కరువు పెరిగాయన్నారు. మహిళ రిజర్వేషన్‌ బిల్లు-2024ను అమలు చేయకపోవడం మహిళల పట్ల కపట ప్రేమకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన దిశా బిల్లును చట్టంగా కాకుండా కేంద్ర ప్రభుత్వ తొక్కి పట్టిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ మహిళలపై దాడులు పెరిగాయని, ఈ నేపథ్యంలో మహిళలపై దాడులు, అత్యాచా రాలు, హింసలను అరికట్టేందుకు ఐద్వా నిర్విరా మంగా పోరాడుతోందని, ఈ క్రమంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో విశాఖ పట్నంలో జాతీయ సమావేశాలను నిర్వహి స్తున్నామని తెలిపారు. సమావేశంలో ఐద్వా పట్టణ అధ్యక్షులు నాగమ్మ భారు, కార్యదర్శి ఫాతిమా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️