చిన్నారుల అదృశ్యం కలకలం

ప్రజాశక్తి-తెనాలి : పట్టణంలో నలుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఒకే రోజు ఒకే ప్రాంతానికి చెందిన నలుగురూ ఒకే సారి అదృశ్యం కావటం పట్టణంలో కలకలం రేపింది. పిల్లల అదృశ్యంపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎంత గాలించినా ఫలితం లేకపోవటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎట్టకేలకు చిన్నారులు క్షేమమనే సమాచారం అటు పోలీసుల్లోనూ, బాధిత కుటుంబాల్లోనూ సంతోషం నింపింది. పట్టణంలోని చినరావూరుతోట పోతురాజు కాలనీలో నివాసం ఉండే పంది మాల్యాద్రి, సుమలత దంపతుల 13 ఏళ్ల కుమార్తె రాధిక, ఎనిమిదేళ్ల కుమారుడు రాఘవేంద్ర, అదే ప్రాంతానికి చెందిన షేక్‌ జాని కుమారుడు తొమ్మిదేళ్ల అల్తాఫ్‌, షేక్‌ బాషా కుమారుడు ఏడేళ్ల ఆరిఫ్‌ శుక్రవారం అదృశ్యమయ్యారు. ఉదయం లేవగానే ఆడుకునే నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చిన వీరు దాదాపు ఏడున్నర నుంచి కనిపించకుండా పోయారని బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. వీరంతా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల్లో చదువుతున్నారు. మాల్యాద్రి, సుమలత దంపతులు ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన వారు. దాదాపు ఆరు నెలల క్రితం కూలి పనుల నిమిత్తం వలస వచ్చి, పోతురాజు కాలనీలో ఉంటున్నారు. యథావిదిగా ఉదయాన్నే వీరు రూరల్‌ గ్రామం కొలకలూరుకు కూలి పనుల నిమిత్తం వెళ్ళారు. తిరిగి వచ్చే సరికి పిల్లలు కనిపించకపోవటంతో ఆ ప్రాంతంలో గాలించారు. అదే సమయంలో అల్తాఫ్‌, ఆరిఫ్‌ కూడా కనిపించటంలేదనే సమాచారంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఒకేదఫా నలుగురు చిన్నారులు అదృశ్యం మిస్టరీగా మారింది. బాధితులు పట్టణ ఒన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. అదృశ్యమైన చిన్నారుల్లో ఆరిఫ్‌ తండ్రి బాష ఆటో డ్రైవర్‌. అల్తాఫ్‌ తండ్రి జాని కూలి పనులకు వెళుతుంటారు. పిల్లలు అదృశ్యం కావటంతో ఆ ప్రాంతంలో విషాదం అలముకుంది. కాగా అల్తాఫ్‌, ఆరిఫ్‌ ఉదయం ఆడుకోవటానిక ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. అదృశ్యమైన మరో బాలిక రాధికను మాత్రం మధ్యాహ్నం సమయంలో ఆ ప్రాంతంలో స్థానికులు చూసినట్లు చెబుతున్నారు. బాధితులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున పట్టణ ఒన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పిల్లల ఆటకాయి తనమే.. అంతా సేఫ్‌-కె.చంద్రశేఖర్‌, సిఐ, ఒన్‌టౌన్‌, తెనాలిఅంతా సేఫ్‌..ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఘటన వెనుక ఎలాంటి కుట్రకోణం లేదు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే గాలింపు చేపట్టాం. ఎట్టకేలకు ఆచూకి లభించింది. నలుగురూ విజయవాడ పార్కుకు వెళ్లారు. సాయంత్రం వరకూ అక్కడే ఉన్నారు. సమాచారం తెలుసుకుని విజయవాడ వెళుతున్నాం. మరికొద్ది సేపట్లో పిల్లలను తెనాలి తీసుకువస్తాం. తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగిస్తాం.

➡️