చీనీ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ప్రజాశక్తి – సింహాద్రిపురంరాష్ట్ర ప్రభుత్వం చీనీ రైతుల కోసం పులివెందులలో మార్కెట్‌ యార్డ్‌ను ప్రారంభించినప్పటికీ ప్రయోజనం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ఆ రైతులు వాపోతున్నారు. గడిచిన కొన్ని నెలలుగా చీనీకాయ కొనుగోలులో సూట్‌ పెడుతూ వ్యాపారస్తులు దగా చేస్తున్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యానశాఖ, మార్కెటింగ్‌శాఖ సమన్వయంతో పులివెందులలో సూట్‌ లేకుండా చీనీ కాయలు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కొనుగోలు కేంద్రంలో వ్యాపారస్తులు మాత్రం స్థానికులు(లోకల్‌) వ్యాపారస్తులు మండీలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నారు. దీంతో తోటల వద్ద చీనీ కాయలు కొనుగోలుకు, మార్కెట్‌ యార్డులో జరుగుతున్న వేలంపాటకు చాలా వ్యత్యాసం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, పులివెందుల, లింగాల, తొండూరు మండలాల్లో దాదాపు 24 వేల హెక్టార్లలో చీనీ సాగులో ఉంది. ప్రతి ఏడాది వేల టన్నుల చీనీ కాయ లను పండిస్తున్నారు. పులివెందుల ప్రాంతంలో పండే చీనీ కాయలు మంచి నాణ్యతతో పాటు పరిమాణం కూడా బాగా ఉంటాయ. దీంతో రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో సైతం మంచి డిమాండ్‌ ఉంది. అయితే రైతులు నేరుగా ఇతర రాష్ట్రాల్లోని మండీలకు తీసుకొని వెళ్లలేక స్థానిక వ్యాపారస్తులకు విక్రయించుకుంటున్నారు.ప్రముఖ కంపెనీలను ఆహ్వానించడంలో ప్రభుత్వం విఫలంచీనీ రైతుల అభ్యున్నతి కోసం పులివెందుల మార్కెట్‌ యార్డ్‌లో చీనీ కాయల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినప్పటికీ అక్కడ ప్రముఖ కంపెనీలు రాకపోవడం పట్ల రైతులు సరైన గిట్టుబాటు ధరలు రావడంలేదని వాపోతున్నారు. ముఖ్యంగా రిలయన్స్‌తోపాటు ఇతర కంపెనీల మండీలు ఏర్పాటు చేస్తే సూటు, కమీషన్‌ లేకుండా ఉండడంతో మంచి ధరల వస్తాయని రైతులు చెబుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం, పాలకులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం చీనీ తోటలకు తెగులు సైతం అధికం కావడం, కూలి పెరగడం, పురుగు మందులు, రసా యనిక ఎరువులు ధరలు పెరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో చీనీ కాయల దిగుబడి తగ్గి, ఖర్చు పెరిగి పోవడంతో తోటల సాగుకు భారమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చీనీ రైతులను ఆదుకోవాలని సిఎంకు వినతి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సొంత నియోజవర్గమైన పులివెందులలో చీనీ రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆరుగాలం శ్రమించి పంట పండించిన తర్వాత సరైన ధరలు లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుని రైతులకు గిట్టుబాటు కావాలంటే కనీసం టన్నుకు రూ.50 వేలు ఉండాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సింహాద్రిపురం మండల పర్యటన నేపథ్యంలో చీనీ రైతులు తమ ఆవేదనను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు.

➡️