చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు

మాట్లాడుతున్న ఎస్‌పి మురళీకృష్ణ

ప్రజాశక్తి-అనకాపల్లి

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చెక్‌పోస్ట్‌ల వద్ద పోలీసులు, కేంద్ర పోలీస్‌ బలగాలు సంయుక్తంగా తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా ఎస్‌పి కెవి.మురళీకృష్ణ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శనివారం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న సాధారణ, తీవ్రమైన కేసులు, ప్రాపర్టీ కేసులు, పోక్సో యాక్ట్‌ కేసులు, 174 సి.ఆర్‌.పి.సి. కేసులు, గంజాయి కేసులు, మిస్సింగ్‌ కేసులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సమీక్షించారు. ఆయా కేసుల్లో దర్యాప్తు పెండింగులో ఉండడానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయుటకు పలు సూచనలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతం వాతావరణంలో జరిగేందుకు అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం ఉల్లంఘించిన కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పోలీస్‌ సిబ్బంది ఎలాంటి అలసత్వం వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లాలోని 9 చెక్‌ పోస్ట్‌ల వద్ద తనిఖీలు నిర్వహించి మాదకద్రవ్యాలు, నాటు సారా, మద్యం అక్రమ రవాణా నిరోధించడం, నగదు, ఉచిత కానుకలు తదితర వస్తువులను అరికట్టాలని ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్‌ కేసులు నమోదు చేయాలన్నారు. రౌడీ షీటర్‌లు, చెడు నడత కలిగిన వారిపై బైండోవర్‌లు చేయించాలన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన ఆరుగురు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలతో జిల్లా ఎస్పీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు బి.విజయ భాస్కర్‌, పి.సత్యనారాయణరావు, డిఎస్‌పిలు ఎస్‌.అప్పలరాజు, కెవి.సత్యనారాయణ, బి.అప్పారావు, పి.నాగేశ్వరరావు, ట్రైనీ డీఎస్పీ భవ్య, ఇన్‌స్పెక్టర్‌లు లక్ష్మణ మూర్తి, చంద్ర శేఖర్‌, అప్పలనాయుడు, గణేష్‌, కుమారస్వామి, ఎస్సైలు రామారావు, రఘువర్మ, జిల్లాలోని ఇతర సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

➡️