చెక్‌ డాములు నిర్మించి సాగు నీరందించాలి

Dec 24,2023 21:11

ప్రజాశక్తి – కురుపాం : గిరిజన ప్రాంతాల్లో చెక్‌ డాములు నిర్మించి గిరిజన రైతులకు సాగునీరందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. మండలంలోని నీలకంఠాపురం పంచాయతీలో గల జుంబిరి, మామిడిమానుగూడ గిరిజన గ్రామాలను ఆదివారం ఆయన సందర్శించి ఆ గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వరద ఎక్కువ వచ్చి ముగ్గురు ప్రాణాలు తీసిన జుంబరి గెడ్డ కల్వర్టు నిర్మాణం చేపట్టాలని, కుమ్మరిపొలంగెడ్డ, మాలమానుపొలం చెక్‌డాములకు నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టినట్టయితే సుమారు 600 ఎకరాలకు సాగునీరందుతుంద న్నారు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చెక్‌ డాములు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి గిరిజనులను ఆదుకోవాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లోని సమస్యలపై జనవరి 10న కలెక్టరేట్‌ వద్ద చేపట్టనున్న ధర్నాకు పెద్దఎత్తున గిరిజనులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గుంతల రోడ్డును వెంటనే బాగు చేయాలిమండలంలోని గుజ్జువాయి పంచాయతీ డి.బారామణి, బారామణిగూడ తదితర ఐదు గిరిజన గ్రామాలకు రాకపోకలకు ఉపయోగపడే రోడ్డు గతుకుల మయమైందని, వెంటనే ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని రెడ్డి వేణు డిమాండ్‌ చేశారు. గిరిజన గ్రామాల్లో సందర్శించిన ఆయన మాట్లాడుతూ నిధులు ఉన్నాయని మండల అధికారులు చెబుతున్నారు తప్ప రోడ్డు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో ఈ రహదారి పూర్తిగా గొంతుల రోడ్డుతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే అత్యవసర సమయంలో ప్రాణాలు విడిచి పెట్టే సంఘటన ఎన్నో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కావున ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ ఈనెల 29న గాంధీనగర్‌ మెయిన్‌ రోడ్డు వద్ద ఐదు గ్రామాల గిరిజన ప్రజలతో నిరసన కార్యక్రమం చేపడతామని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరావు, వి.వాసు, అంగధ, బిడ్డకి వెంకట్రావు, ఆరికి గిరి, స్థానికులు గిరిజనులు పాల్గొన్నారు.

➡️