చెరువులు కబ్జా చేసి సంక్షేమ భవనం కడతారా?

Mar 16,2024 21:02

ప్రజాశక్తి- బొబ్బిలి : చెరువులు, బందలు పరిరక్షించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, బొబ్బిలి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సంక్షేమ భవనానికి శంకుస్థాపన ఏ విధంగా చేస్తారని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి. శంకర్రావు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు కోట అప్పన్న, రైతు కూలీ సంఘం నాయకులు వెలగాడు కృష్ణ, డివైఎఫ్‌ఐ నాయకులు ఎ.సురేష్‌ ప్రశ్నించారు. వైసిపి నాయకులు ఓట్లు కోసం కుల రాజకీయాలు మానుకోవాలని అన్నారు. అధికారం కోసం కుల రాజకీయాలు చేసి ప్రజలను మోసం చేయకండని హితవు పలికారు. మున్సిపల్‌ కమిషనర్‌ని అడిగి మున్సిపల్‌ కార్మికులు పార్కు చెరువు గట్టుపై విశ్రాంతి గదికి లక్ష రూపాయలు ఖర్చు చేసి కార్మికులు పునాదులు వేస్తే ఎమ్మెల్యే తక్కువ కులం వాళ్ళని అక్కడ రేకుల షెడ్‌ కట్టుకోనీయకుండా పోలీసులను పెట్టి తొలగించారని చెప్పారు. అటువంటిది ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులూ లేకుండా ఎమ్‌పి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ హుగ్లీ జూట్‌ మిల్లి పక్కన ఉన్న బంధను కప్పి కాపు సంక్షేమ భవనానికి భూమి పూజ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ మరికొద్ది గంటల్లో రాబోతున్న తరుణంలో చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ చెరువులు కప్పి సంక్షేమ భవనానికి భూమి పూజ చేసిన ఎమ్‌పి, బొబ్బిలి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై అన్ని ఆధారాలతో చట్ట ఉల్లంఘనకి పాల్పడుతున్న వారిపై కోర్టులో కేసులు వేస్తామని తెలియజేశారు.

➡️