చైర్మన్‌ గిరి కోసం ఎదురుచూపులు

Dec 24,2023 20:55

ప్రజాశక్తి – మక్కువ:  రాష్ట్ర జాతరగా అవతరించిన శంబర పోలమాంబ అమ్మవారి జాతరకు సంబంధించి ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ గిరి కోసం వైసిపిలోని రెండు గ్రూపులు ఎదురుచూస్తున్నాయి. జాతర సమీపిస్తున్నప్పటికీ ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటుపై అధికారులు, రాజకీయ నాయకులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఈనెల 14తోనే పాత ట్రస్టు బోర్డు రెండేళ్ల గడువు ముగిసింది. జనవరి 22, 23, 24 తేదీల నుంచి మార్చి వరకు 10 వారాల పాటు ఈ జాతర జరగనుంది. ఇప్పటికే జాతరకు సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కేంద్రంలో ఆర్‌డిఒ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనూ ట్రస్టు బోర్డు అంశం ప్రస్తావనకు రానట్టు తెలిసింది. ఇప్పటికే శంబరలోని వైసిపిలో రెండు గ్రూపులు ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు కోసం ఎదురుచూస్తూ చైర్మన్‌ గిరి కోసం ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఒక గ్రూపునకు చెందిన పూడి దాలి నాయుడు ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా రెండేళ్లు కొనసాగారు. ఈసారి ట్రస్టు బోర్డు ఏర్పాటైతే చైర్మన్‌ పదవి కోసం తీళ్ల తిరుపతిరావు గ్రూపు ఆశగా ఎదురు చూస్తోంది. గతంలో వయసు రీత్యా మండలంలోని వైసిపి నాయకత్వం పూడి దాలినాయుడుకు ఈ అవకాశం కల్పించింది. అయితే ఈసారి తమ గ్రూపునకు చైర్మన్‌ పదవి ఇవ్వాలని తిరుపతిరావు వర్గం గట్టిగా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇదిలా ఉండగా శంబరలో ఉన్న రెండు గ్రూపులను వైసిపి నాయకత్వం ఎవరిని కాదనలేక చెరోచేత్తో నడిపిస్తూ వస్తుంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి రెండు గ్రూపులుగా ఏర్పడింది. అప్పట్లో సర్పంచ్‌ ఎన్నికల్లో కలిసి పని చేసినా, ఎంపిటిసి ఎన్నికల సమయంలో చీలిక ఏర్పడింది. తిరుపతిరావు గ్రూపులోని గంజి అప్పలనాయుడుకు ఎంపిటిసి టికెట్‌ ఇవ్వాలని పట్టు పట్టినప్పటికీ చివరి నిమిషంలో అధిష్టానం దాలినాయుడు తమ్ముడు లక్ష్మణరావుకు సీటు ఇవ్వడంతో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో తిరుపతిరావు గ్రూపు బాహాటంగానే టిడిపి అభ్యర్థి పోలినాయుడు గెలుపునకు సహకరించింది. దీంతో అప్పటి నుంచి విభేదాలు అలాగే ఉన్నాయి. ఏది ఏమైనా ఈసారి ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటైతే తిరుపతిరావు గ్రూపునకే చైర్మన్‌ అవకాశం దక్కుతుందేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు అంశం తేలకపోవడంతో ఆశావాహులకు అంతర్‌ మదనం తప్పడం లేదు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏ విధమైన కమిటీలు లేకుండా దేవాదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో జాతర జరిగే ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు.నేడు శంబరలోకి పెదపోలమాంబ జాతరలో తొలి ఘట్టమైన పెదపోలమాంబ అమ్మవారిని గ్రామంలోకి సోమవారం తీసుకురానున్నారు. సోమవారం నుంచి జనవరి 3 వరకు పెద్ద పోలమాంబ భక్తుల పూజలు అందుకోనుంది. అనంతరం పోలమాంబ జాతరకు సన్నద్ధం మొదలవుతుంది. సోమవారం రాత్రి పోలమాంబ ఆలయ కార్యనిర్వహణ అధికారి వివిఎస్‌ నారాయణ ఆధ్వర్యంలో పెద్ద పోలమాంబను మేళతాళాల నడుమ భక్తిశ్రద్ధలతో గ్రామంలోకి కొని తీసుకురానున్నారు.

➡️