చైర్మన్‌ సీటును మైనార్టీలకు ఇస్తారా?

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: మార్కాపురం మున్సిపల్‌ చైర్మన్‌ సీటును ముస్లిం మైనార్టీల కోసం త్యాగం చేస్తారా అని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్‌ ఫారూఖ్‌ షుబ్లీ పాలకులకు సవాల్‌ విసిరారు. శనివారం స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజకీయ చైతన్య సదస్సు కార్యక్రమం మార్కాపురం కమిటీ అధ్యక్షులు మొఘల్‌ జాబిర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్‌ ఫరూక్‌ షుబ్లి హాజరై ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అధికార వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంటే వాటిని ప్రశ్నిస్తే కేసులు, ప్రశంసిస్తే పదవులు అన్న విధంగా ప్రభుత్వ వైఖరి ఉందంటూ ఎద్దేవా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ వర్గాలు ఒక తాటిపై వచ్చి ముస్లిం సమాజాన్ని అభివృద్ధి చేసేవారికే పట్టం కట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నజీర్‌ అహ్మద్‌, సమితి లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది సలీం పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా హుస్సేన్‌, స్టేట్‌ మీడియా కోఆర్డినేటర్‌ అబ్దుల్‌ గపూర్‌, ఉలమా వింగ్‌ సభ్యులు షబ్బీర్‌, ఉపాధ్యక్షులు షేక్‌ మహబూబ్‌ బాషా, షేక్‌ నాసర్‌ సాహెబ్‌, సయ్యద్‌ నాయబ్‌ రసూల్‌, ట్రెజరర్‌ తాజ్‌, షాదా, కబీర్‌, షాకిర్‌, సిలార్‌, జిలాని పాల్గొన్నారు.

➡️