‘జంగా కృష్ణమూర్తి సీటు ఆశించడంలో తప్పేమీ లేదు’

పిడుగురాళ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం గురజాల నియోజక వర్గంలో తుపాను కారణంగా ఆపడం జరిగిందని, రానున్న రెండు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసే విధంగా ప్రతి నాయకుడుకు ముగ్గురు వాలంటీర్లను కలిపి కార్యక్రమం నిర్వహించనున్నట్లు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి అన్నారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన జగనన్న సర్వే రిపోర్ట్‌ లో గురజాలలో ప్రస్తుతం మళ్ళీ ఎమ్మెల్యేగా తాను గెలిచేందుకు 61 శాతం ఉందని, హైకమాండ్‌ రిపోర్ట్‌ లో ఎక్కడ కూడా తనపై అవినీతి ఆరోపణలు లేవంటూ రిపోర్ట్‌ మీడియా ముందు చూపించారు. ఒకవేళ గురజాల నుండి వెళ్లాల్సి వస్తే చరిత్ర సృష్టించే వెళ్తానని చెప్పారు. గురజాల నియోజకవర్గం సీటును ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆశిస్తున్నారంటూ ఇటీవల వచ్చిన వార్తలపై మహేశ్‌రెడ్డిని ప్రశ్నించగా ఆయన స్పందించారు. జంగా కృష్ణమూర్తి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న సీనియర్‌ నాయకులని, సీటు ఆశించ డంలో తప్పేమీ లేదని అన్నారు. అధిష్టానం ఎవరికి సీటు ఇచ్చిన కలిసి పని చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. మైనింగ్‌ చేస్తున్న ప్రతి ఒక్కరు పర్మిషన్లు తీసు కొనే చేసుకుంటున్నారని, తనపై అవినీతి ఆరోపణలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

➡️