జగనన్నకు చెబుదామంటే అరెస్టులా?

సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌లో అరెస్టయిన అంగన్వాడీలు, సిఐటియు నాయకులు
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ :
తమ సమస్యలను జగనన్నకు చెబుదామని విజయవాడకు బయలుదేరి వెళుతున్న అంగన్వాడీలను, వారికి సంఘీభావం తెలుపుతున్న సిపిఎం, మహిళా సంఘ నాయకులను పట్టణ పోలీసులు సోమవారం స్థానిక రైల్వేస్టేషన్‌లో ఉండగా వారిని బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించటం ఏమిటని సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం బూటకమని, ప్రజల్ని మభ్య పెట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీలు ప్రజాస్వామ్య యుతంగా 40 రోజులు పైగా సమ్మె చేస్తుంటే దాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం అనేక కుయుక్తులు చేస్తోందని మండిపడ్డారు. అంగన్వాడీలపై ఈ ప్రభుత్వానికి అంత కక్ష ఎందుకని నిలదీశారు. ప్రజా ఉద్యమాలను అణచాలని చూస్తే ప్రజా ఉప్పెనలో ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరించారు. మహిళలను అరెస్ట్‌ చేసేటప్పుడు మహిళా పోలీసులు ఉండాలనే విచక్షణా ప్రభుత్వానికి లేదన్నారు. అంగన్వాడీల సమస్యలపై సిఎం స్పష్టమైన హామీనిచ్చేవరకూ ఆందోళన కొనసాగుతుందని, అవసరమైతే స్టేషన్లోనే ఉంటామని అంగన్వాడీలు ఉమాదేవి, డి.కుమారి చెప్పారు. అరెస్టయిన వారిలో అంగన్వాడీలు జి.ఉమ, పి.ప్రమీల, డి.వెంకట రమణ, శ్రీలక్ష్మి, రాజ్యలక్ష్మి, రోజ్‌మేరి, మరియమ్మ, ముప్పాళ్ల, సత్తెనపల్లి మండలాల అంగన్వాడీలు, ఐద్వా పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రజిని, నాయకులు జి.ఉమశ్రీ, డి.విమల, చేనేత కార్మిక సంఘం నాయకులు ఎ.వీరబ్రహ్మం, సిఐటియు మండల కార్యదర్శి పి.మహేష్‌, ప్రజానాట్య మండలి నాయకులు పి.సూర్యప్రకాశరావు, కె.నాగేశ్వరావు, వెంకటనారాయణ ఉన్నారు.
ప్రజాశక్తి – వినుకొండ : అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధం, అరెస్టులకు నిరసనగా సిపిఎం కార్యాలయం వద్ద ప్రదర్శన చేశారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాడ్యుటీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎ.ఆంజనేయులు, ఎం.తిరుమలలక్ష్మి, కె.శివరామకృష్ణ, ఆర్‌.మునివెంకటేశ్వర్లు, బి.కోటయ్య, ఐద్వా నాయకులు నాసర్‌బి పాల్గొన్నారు.
ప్రజాశక్తి – చిలకలూరిపేట : స్థానిక పండరిపురంలోని సిఐటియు కార్యాలయం నుండి ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకూ అంగన్వాడీలు, సిఐటియు నాయకులు నిరసన ప్రదర్శన చేశారు. సిఐటియు మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రభుత్వం తనతీరు మార్చుకోకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ప్రదర్శనలో యూనియన్‌ సెక్టార్‌ అధ్యక్షులు జి.సావిత్రితోపాటు సంఘీభావంగా రైతు సంఘం నాయకులు ఎస్‌.లూథర్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – అమరావతి : విజయవాడతోపాటు అన్ని ప్రాంతాల్లోనూ అంగన్వాడీలను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించిందని సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు విమర్శించారు. అరెస్టు చేసిన వారిని వివిధ ప్రాంతాలకు తరలించారని, సమస్యల పరిష్కరించే దమ్ము లేక అణిచివేత్తకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళలనే ఆలోచన లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి తీరుతారని హెచ్చరించారు.

➡️