జగనన్న కాలనీలో దర్జాగా కబ్జా

Jan 8,2024 20:46

ప్రజాశక్తి – గుర్ల : మండలంలో గూడెం రెవెన్యూ పరిధిలో భూకబ్జాలు మితిమీరుతున్నాయి. సుమారు 3.50 ఎకరాల విస్తీర్ణం గల రామదుల చెరువుని కబ్జా చేశారు. అక్కడితో ఆగకుండా ప్రస్తుతం జగనన్న కాలనీలో పేదలకు కేటాయించిన ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమిస్తున్నారు. ఈ రెండింటిని ఒకే వ్యక్తి ఆక్రమించడం గమనార్హం. దీనికి రెవెన్యూ సిబ్బంది అమ్యామ్యాలు పుచ్చుకుని సహాయ సహకారాలు అందిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గూడెం రెవెన్యూలో సర్వే నెంబర్‌ 347/6లో సుమారు ఎకరా ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరరత్నాలు -పేదలందరికీ ఇళ్లు పథకానికి కేటాయించారు. అందులో భాగంగా గూడెం, గుజంగి వలస గ్రామాల లబ్ధిదార్లకు ఇళ్లపట్టాలు అందించారు. సదరు జాగాల్లో లబ్ధిదార్లు చక్కగా ఇళ్లను నిర్మించుకున్నారు. మిగిలిన స్థలంలో రైతు భరోసా కేంద్రంతో పాటు, గూడెం పిఎసిఎస్‌కు అవసరమయ్యే భవనాలను నిర్మించారు. మరో 10 మందికి సరిపడా భూమి ఉన్నప్పటికీ, అర్హులైన పేదలకు కేటాయిం చలేదు. గ్రామానికి చెందిన కొంతమంది తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని స్పందనలో దరఖాస్తులు చేసుకుంటే వారికి స్థలంలేదని చెప్పి దరఖాస్తులను తిరస్కరించారు. అయితే అదే స్థలాన్ని గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతకు అప్పనంగా కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సంబంధిత వ్యక్తిని సదరు స్థలంలో నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులు అంతర్గతంగా చెప్పినట్టు భోగట్టా. రెవెన్యూ సిబ్బంది సూచనలతో ఆ వ్యక్తి నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ కబ్జా అంతటికి స్థానిక విఆర్‌ఒ కీలకంగా వ్యవహారిస్తున్నట్టు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హులైన లబ్ధిదార్లు తమకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని కలెక్టరు గ్రీవెన్సులో దరఖాస్తులు చేసుకుని నెలల కొద్దీ తహసీల్దారు, విఆర్‌ఒల చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ ఆ స్థలంలో డీజిటల్‌ లైబ్రరీ కట్టాలని, గోడౌను నిర్మించాలని సాకులు చెప్పుకుంటూ చివరికి అధికార పార్టీ నాయకునికి అప్పనంగా కట్టబెడుతున్నారని దరఖాస్తుదార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా చేపడుతున్న జగనన్న కాలనీలో ఉన్న మిగులు భూమిని సర్దు బాటులకు, కబ్జాదారలుకు కట్టబెట్టటం ఏమిటని అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులే విస్తుపోతున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయానికి గండి పడుతోందని మరి కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ భూకబ్జాపై ఉన్నతధికారులు దృష్టి సారించి అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.

➡️