జల్సాలకు బానిసై..

Jan 29,2024 20:52

ప్రజాశక్తి – భోగాపురం :  మద్యానికి, జల్సాలకు బానిసైన ఇంజినీరింగ్‌ విద్యార్థి బంగారం కోసం తాను అద్దెకు ఉంటున్న యజమానురాలునే హత్య చేశాడు. బాత్రూమ్‌లో కాలుజారి పడిపోయి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఊపిరాడిక చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలడంతో పోలీసులు లోతుగా విచారించారు. దీంతో తానే హత్య చేసినట్లు ఆ ఇంజనీరింగ్‌ విద్యార్థి ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి ఆరున్నర తులాల బంగారాన్ని రికవరీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సిఐ బివి వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ సూర్య కుమారి సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. విజయనగరం మండలం గుంకలాం గ్రామానికి చెందిన ఇజ్జరపు కూర్మారావు తగరపువలస బ్రిడ్జి సమీపంలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చివరి సంవత్సరం చదువు తున్నాడు. రాజపులోవ పంచాయతీ మహారాజుపేటలోని ముద్దాడ అప్పయ్యమ్మ అనే వృద్ధురాలు ఇంట్లో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. ఇద్దరు స్నేహితులు సంక్రాంతి పండగకు ఇంటికి వెళ్లి ఇంకా తిరిగి రాలేదు. దీంతో రూమ్‌లో ఒక్కడే ఉంటున్నాడు. జల్సాలకు అలవాటు పడి గదిలో అప్పుడప్పుడు అమ్మాయిలు, మద్యం తాగి పార్టీలు చేసుకునేవాడు. ఈ విషయం తెలిసి అప్పయ్యమ్మ మందలించి గొడవపడేది. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీన గది వద్దకు వచ్చిన అప్పయ్యమ్మకు ఊపిరాడకుండా నోరు ముక్కు మూయడంతో ఆమె చనిపోయింది. ఆమె ఇంటి వద్ద ఉన్న బాత్రూమ్‌లోకి తీసుకువెళ్లి ఒంటి పైనున్న బంగారాన్ని తీసేసి కాలుజారి పడిపోయినట్లు పడేశాడు. అదే రోజు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే వెళ్లి పరిశీలించారు. బంగారం మాయం కావడంతో అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కూర్మారావు నడవడికపై అనుమానం వచ్చి విచారణ చేయడంతో నేరం ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న సిబ్బందిని సిఐ అభినందించారు.20 తులాలు బంగారం ఉంటుందని ప్రచారం హత్యకు గురైన అప్పయ్యమ్మ ఒంటిపై సుమారు 20 తులాలు బంగారం ఉంటుందని గ్రామంలో ప్రచారం జరుగుతుంది. అయితే పోలీసులు కేవలం ఆరున్నర తులాలు మాత్రమే నిందితుడు తీసినట్లు తెలిపారు. దీనిపై విలేకరులు సిఐను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని, ఇది అవాస్తవమని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులు అలాంటిదేమి తమ దృష్టికి తీసుకు రాలేదని ఆయన అన్నారు.

➡️