జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించాలి : సిపిఎం

ప్రజాశక్తి-కడప అర్బన్‌ జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైదుకూరు, కడప నగరంలో మంచినీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోందని పాలకులు, అధికా రులకు ముందు చూపు లేకపోవడంతోనే నీటి సమస్య ఉత్పన్నమవుతోందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌, రబీ సీజన్లో జిల్లాలో తగినంత వర్షపాతం లేకపోవడంతో కుందు, పెన్నా నదులు ఎండిపోయాయని చెప్పారు. వర్షాలు లేకపోవడం ఒక కారణమైతే, ఇసుకను నదులలో నుంచి తోడువేసి ఎక్కడపడితే అక్కడ డంపింగ్‌ చేయడం వల్ల ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ విషయం పాలకులకు, అధికారులకు తెలిసినా కూడా ఏప్రిల్‌, మేలో మంచినీటి సమస్యపై ఏమాత్రం శ్రద్ద పెట్టడం లేదని పేర్కొన్నారు. కడప నగరంలో 5, 6 రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారని తెలిపారు. అది కూడా సరిపడా రావడం లేదని, మైదుకూరు, కడప నగరంలో చాలా ప్రాంతాల్లో నీటి సమస్య ఉందని తెలిపారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని, కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్లు కూడా రావడం లేదని పేర్కొన్నారు. నగర ప్రజానీకం మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పారు. నీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన బోర్లు వేయాలని, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని పేర్కొన్నారు. నీటి సమస్య పరిష్కారానికి ఎన్నికల కోడ్‌ నుంచి మినహాయించాలని చెప్పారు. జిల్లా ఉన్నతాధికారులు శ్రద్ద పెట్టాలని కోరారు శాశ్వత నీటి సమస్యను పరిష్కరించడంలో పాలక ప్రభుత్వాలు విఫలం చెందాయని ధ్వజమెత్తారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామ్మోహన్‌, కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి పాల్గొన్నారు.

➡️