జిసిసి కొనుగోలు లేక చింతపండు అక్రమ రవాణా

Mar 26,2024 21:58

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ప్రతి ఏటా గిరిజనుల జీవనాధారమైన చింతపండు పంట. అయితే గిరిజనులు పండించిన చింతపండును గిరిజన సహకార సంస్థ అధికారులు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఇదే అదునుగా బయట ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి గిరిజనుల వద్ద తక్కువ ధరకే చింతపండు కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్నారని సిపిఎం జిల్లా నాయకులు కోలక అవినాష్‌, మండంగి రమణ విమర్శించారు. మంగళవారం గొరడ, దుడ్డుఖల్లు ప్రాంతాల్లో వ్యాపారులు, గిరిజనుల వద్ద చింతపండు కొనుగోలు చేసి మోటార్‌ సైకిల్‌తో తరలించడం కనిపించింది. పండించిన చింతపండును జిసిసి అధికారులు కొనుగోలు చేసేందుకు రాకపోవడంతో పంట నిల్వ ఉంచుకోలేక, ఏం చేసేది లేక చివరికి ప్రతి ఏటా దళారులకు, వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి. ఇప్పటికైనా జిసిసి అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల ద్వారా చింతపండు కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని సిపిఎం నాయకులు కోరుతున్నారు.

➡️