జీడిపిక్కలు అధిక ధరకు కొనుగోలు చేయాలి

సమావేశంలో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ప్రజాశక్తి-రంపచోడవరం

ఏజెన్సీలోని గిరిజనులు పండించే జీడి పిక్కలను గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే కొనుగోలుదారులకు సూచించారు. జీడి పిక్కల కొనుగోలు విషయమై కొనుగోలుదారులు, ఎన్‌జిఒలతో శనివారం తన ఛాంబర్‌లో పిఒ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని ప్రతి సంవత్సరం ఎన్ని మెట్రిక్‌ టన్నులు జీడి పిక్కలు దిగుమతి అవుతున్నది, ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నదీ ఆరా తీశారు. రైతులు పండించిన జీడిపిక్కలు మూడు నెలల పాటు గోదాముల్లో భద్రపర్చి, తర్వాత అమ్మితే ఎంత రేటు వస్తుందని అడిగి తెలుసుకున్నారు. జీడి పిక్కలు కొనుగోలుకు లైసెన్సు ఉన్న వారికే జీడిపిక్కలు అమ్మి విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఏజెన్సీలో ఎన్ని వేల ఎకరాలలో జీడి మామిడి తోటలు సాగు చేస్తున్నారో ఆరా తీశారు. ఈ సంవత్సరం జీడి పిక్కలు ఎంత రేటుతో కొనుగోలు చేస్తున్నారు, ఎప్పటి నుండి కొనుగోలు చేస్తారు, వాటిని ఏ రాష్ట్రానికి తరలిస్తారు, ఆయా రాష్ట్రాల్లో ఎంత రేటు ఉన్నది తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ మార్కెట్‌ రేట్‌ ప్రకారం జీడి పిక్కలు కొనుగోలు చేయడం జరుగుతుందని కొనుగోలుదారులు ప్రాజెక్ట్‌ అధికారికి తెలియజేశారు. ఈ ప్రాంతంలో పండించిన జీడి పిక్కలు ఆర్గానిక్‌ సర్టిఫికెట్లు ఉంటే ఒక కిలో జీడిపిక్కలకు ఎంత రేటు వస్తుంది ప్రాజెక్ట్‌ అధికారి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో జనరల్‌ సిహెచ్‌.శ్రీనివాసరావు, హార్టికల్చర్‌ అధికారి కె.చిట్టిబాబు, వెలుగు ఏపీడి ఎ.శ్రీనివాసరావు, ప్రాజెక్ట్‌ అగ్రికల్చర్‌ అధికారి యల్‌. రాంబాబు, రబ్బర్‌ ఏపీవో దుర్గేష్‌, జీడి మామిడి పిక్కల కొనుగోలుదారులు, ఎన్‌జిఓ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️