జీడి రైతు ఆశలు అడియాసలేనా?

Feb 3,2024 21:00

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ఈ ఏడాది కూడా కారు మబ్బుల ప్రభావం జీడి పంటపై పడడంతో రైతులు ఆశించినంత స్థాయిలో పంట దిగుబడి లేకపోతే గిరిజన రైతుల ఆశలు అడియాసలయ్యాయి. గత నాలుగేళ్ల నుంచి జీడి పంట కాపు సమయాన కారు మబ్బులు కమ్ముకోవడంతో దిగుబడి తగ్గుతూ వస్తోంది. జీడి పంట నష్టాన్ని చవిచూస్తున్న గిరిజన రైతులకు ఈ ఏడాది కూడా ప్రకృతి పగ వీడలేదు. ఈ ఏడాదైనా జీడి పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని అనుకున్న సమయంలో గత పది రోజుల నుంచి కారు మబ్బులు కాయడంతో జీడి పంటకు టి దోమ సోకింది. ఎకరా జీడి ఉన్నచోట అర ఎకరా కూడా పంట వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ మండలాల్లో విస్తారంగా జీడితోటలు ఉన్నాయి. గిరిజన రైతులకు ప్రధానమైన పంట జీడి. తమ జీవనానికి, ఆర్థిక ఇబ్బందులు తీరేందుకు జీడిపంట ఎంతగానో దోహదపడుతుందని గిరిజన రైతులు చెబుతున్నారు. అయితే గత నాలుగేళ్ల ఏళ్ల నుంచి ఆశించిన స్థాయిలో పంట దిగుబడి ఉండడంలేదని అంటున్నారు. అధిక శాతం మంది రైతులు జీడి, చింత పంటలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.వేల ఎకరాల్లో సాగుపార్వతీపురం ఐటిడిఎ పరిధిలో సుమారు 50 వేల ఎకరాల్లో జీడి పంట సాగులో ఉంది. గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లోనే 35వేల ఎకరాల్లో జీడి తోటలు ఉన్నాయి. ఏటా సుమారు 10 వేల క్వింటాళ్ల జీడి పంట దిగుబడి వస్తోందని అంచనా. దీన్ని బట్టి చూస్తే గిరిజన రైతులు జీడి పంటపై ఎంత మేర ఆధారపడి ఉన్నారో అర్ధమవుతుంది. పుష్కలమైన జీడి తోటలున్నప్పటికీ మద్దతు ధర లభించకపోవడంతో ఆర్థికంగా అభివద్ధి చెందలేకపోతున్నారు. పురుగు మందులు సరఫరా లేదు…గత మూడేళ్ల నుంచి జీడి పంటకు తీవ్రనష్టం వాటిల్లితున్నా రక్షణ చర్యలు చేపట్టడంలో అటు ప్రభుత్వం, ఇటు ఐటిడిఎ అధికారులు శ్రద్ధ వహించడం లేదు. దీంతో ప్రతి ఏటా జీడి పంటపై ఆశలు పెట్టుకున్న రైతులకు తీవ్ర నిరాశే మిగులుతుంది. ఈసారైనా అధికారులు మేల్కొని జీడి పంట నష్ట నివారణకు పురుగు మందులు సరఫరా చేయాలి.కోలక అవినాష్‌, ఎపి గిరిజన సంఘం నాయకులు .జీడి దిగుబడి తగ్గింది….కారు మబ్బుల వల్ల జీడి పంటకు పురుగు పట్టడంతో ఈ ఏడాది కూడా జీడి పంట దిగుబడి బాగా తగ్గింది. పిక్కలు కాసిన లోపల పలుకు లేకపోవడంతో జీడి అమ్మకాలు చేపట్టినా అనుకున్నంత మద్దతు ధర రాదు. ఈ ఏడాది ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.పువ్వల స్వామి, గిరిజన రైతు,పి.ఆమిటి.రుణమాఫీ చేయాలి… గిరిజన రైతులు పండించే పంటలకు నష్టం వాటిల్లడంతో ఆర్థికంగా చితికి పోతున్నారు. వేలాది రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నా పంట చేతికి అందకపోవడంతో కట్టలేని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి రైతులు తీసుకున్న అప్పులకు రుణమాఫీ చేయాలి.మండంగి రమణ, ఎంపిటిసి, చెముడు గూడ.

➡️