జీతాలు పెంచినప్పుడే అంగన్వాడీలకు నిజమైన పండగ

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారం 36వ రోజు కొనసాగింది. పండగరోజుల్లోనూ అంగన్వాడీలు సమ్మె శిబిరాలకు తరలివచ్చారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని స్టేషన్‌ రోడ్డు గాంధీ పార్కు ధర్నాచౌక్‌ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శిబిరాన్ని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకు మారి సందర్శించి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీల వేతనాలు పెంచిన రోజే అంగన్వాడీలకు నిజమైన పండుగన్నారు. ఐదుసార్లు చర్చలకు పిలిచినా అవి ఆద్యంతం బెదిరింపు ధోరణిలో కొనసాగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలుండాలని, సమ్మెపై ఎస్మాను ప్రయోగిస్తూ ఇచ్చిన జీవో 2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు కెపి మెటిల్డాదేవి, నాయకులు ఆదిలక్ష్మి, వెంగమాంబ, సుహాసిని, కరీమున్‌, అజి, అమీరున్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – వినుకొండ : సురేష్‌ మహల్‌ రోడ్‌లోని అంగనవాడి శిబిరం కొనసాగుతోంది. శిబిరాన్ని సోమవారం జాషువా సాంస్కృతి సమైక్య అధ్యక్షులు, విశ్రాంత ఎంఇఒ జాన్‌సుందరరావు సందర్శించి మద్దతుగా మాట్లాడారు. శిబిరం ఆవరణలో అంగన్వాడీలు భారీ రంగవల్లులతోపాటు పొంగళ్లు చేశారు మంగళవారం శిబిరాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు పి.రూబెన్‌ సందర్శించి సంఘీభావంగా మాట్లాడారు. అంగన్వాడీలకు పండగ సంతోషాన్ని ప్రభుత్వం దూరం చేసిందని, నిద్రాహారాలు మాని సమ్మె శిబిరంలో ఉండాల్సిన దుస్థితి కల్పించిందని విమర్శించారు. ఇంట్లో ఆడపడుచు కన్నీరు పెడితేనే ఇల్లంతా అంతే ఉంటుందని, దీనిపై ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ఇదిలా ఉండగా తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే తమకు ఉరేసుకోవడం మినహా మరో మార్గం లేదనే సంకేతాన్నిస్తూ అంగన్వాడీలు ఉరితాళ్లతో నిరసన తెలిపారు. సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంతరెడ్డి, ఎ.ఆంజనేయులు, ఎఐటియుసి నాయకులు ఎ.మారుతి వరప్రసాద్‌, అంగన్వాడీ నాయకులు లక్ష్మీ ప్రసన్న, జి.పద్మ, నిర్మల, బీబులు, కృష్ణకుమారి, ఉమాశంకరి, గాయత్రి శ్రీదేవి, హరిత పాల్గొన్నారు.
ప్రజాశక్తి – మాచర్ల : పట్టణంలో సమ్మె శిబిరం కొనసాగుతోంది. యూనియన్‌ నాయకులు ఉషారాణి మాట్లాడారు. ఇందిర, కె.పద్మావతి, శాంతలత, కోటేశ్వరి, సుందరలీల, శారద, దుర్గా శివలక్ష్మీ, రుక్మిణి, జయలక్ష్మీ, శివపార్వతీ, లీలావతి, వెంకటరమణ, సైదమ్మ, చిలకమ్మ, మల్లేశ్వరి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణంలో సమ్మె శిబిరం కొనసాగు తోంది. ఎద్దుకు వినతిపత్రం ఇస్తూ అంగన్వా డీలు నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు చిన్నం పుల్లారావు మద్దతుగా మాట్లాడారు. మండల కార్యదర్శి టి.శ్రీనివాస రావు, అంగన్వాడి నాయకులు డి.శాంతమణి, షేక్‌ హజ్ర, బుజ్జి, కవిత, పీర్మాభి, ఆష, హసీనా, గురవమ్మ, విజయరాణి, సువర్ణ, రాణి, లక్ష్మమ్మ పాల్గొన్నారు.
ప్రజాశక్తి – అమరావతి : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం కొనసాగుతోంది. సిఐటియు మండల కార్యదర్శి బి.సూరిబాబు మాట్లాడారు.

➡️