జెఎన్‌టియులో తరగతి గదులు ప్రారంభం

Feb 5,2024 23:16

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ద్వారా యువతలో సామర్థ్యం పెరుగుతుందని, విద్యకు వైసిపి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నరసరావుపేట మండలంలోని కాకాని పరిధిలోని జేఎన్టీయూ కళాశాలలో రూ.81 కోట్లతో నిర్మించిన ఆదనవు తరగతి గదుల 2వ బ్లాక్‌ను, కళాశాల కార్యనిర్వాహక కార్యాలయాన్ని, సిమెంట్‌ రోడ్లను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలపై మంత్రులు ప్రసంగించగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి నుండి కళాశాల పూర్తిస్థాయిలో అందులో అందుబాటులోకి రావడంతో తన కృషి ఫలించిందన్నారు. ప్రస్తుతం కళాశాలలో 1300 మంది చదువుకుంటున్నారన్నారు. మరో 2 నెలల్లో హాస్టల్‌ను నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్‌ నాగటి మనోహర్‌ నాయుడు, ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, పుడా చైర్మన్‌ మిట్టపల్లి రమేష్‌, ఎన్‌ఇసి కళాశాల చైర్మన్‌ మిట్టపల్లి కోటేశ్వరరావు, ఎంపిపి ఎం.శ్రీనివాసరావు, జెడ్‌పిటిసి పి.చిట్టిబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలేజీ అధ్యాపకులు పాల్గొన్నారు.

➡️