టిడిపిలో దుమారం

Feb 4,2024 21:15

ఎన్నికల ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో సాలూరు నియోజకవర్గంలో టిడిపిలో గ్రూపు రాజకీయాల కుంపటి మరింత రాజుకుంటోంది. కొద్దినెలల క్రితం వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న గ్రూపు రాజకీయాలు ఇప్పుడు బుసకొడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి ఆర్‌పి భంజ్‌దేవ్‌ ఓటమికి సంధ్యారాణి రూ.2 కోట్లు తీసుకుని, వైసిపితో చేతులు కలిపారంటూ టిడిపి సీనియర్‌ నాయకులు పెంట తిరుపతిరావు సంచలన ఆరోపణ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల ముందు ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీలో గ్రూపు రాజకీయాలు చినికిచినికి గాలివానలా తయారయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రజాశక్తి-సాలూరు : టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌ గ్రూపుల మధ్య గత ఐదేళ్లుగా పొసగని పరిస్థితి నెలకొంది. తమను ఇన్‌ఛార్జి హోదాలో సంధ్యారాణి ఎన్నడూ కలుపుకు పోలేదని భంజ్‌దేవ్‌ గ్రూపు నాయకులు ఆరోపిస్తున్నారు. ఆమె ఒంటెద్దు పోకడల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని భంజ్‌దేవ్‌ అనేకసార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అధిష్టానం కూడా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా పరిస్థితి అలాగే ఉంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఎదుర్కోనున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ దృష్టి సారించడంతో ఇరు గ్రూపులు ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. సంధ్యారాణికి సీటు ఇస్తే గెలుపు సాధ్యం కాదని ప్రత్యర్థి గ్రూపు నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తమ గ్రూపునకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆమె విజయం కోసం పని చేయరనే సంకేతాలు పార్టీ పెద్దలకు పంపించారు. ఇలాంటి పరిస్థితుల్లో పాలకొండ నియోజకవర్గం వంగర మండలానికి చెందిన గిరిజన నాయకురాలు, రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు ఎం.తేజోవతిని భంజ్‌దేవ్‌ గ్రూపు నాయకులు తెరపైకి తీసుకొచ్చారు. ఆమె టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేయడం, ప్రభుత్వ ఆమోదం, పార్టీలో చేరడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జి సంధ్యారాణితోపాటు ఆశావహ నాయకురాలు తేజోవతి కూడా టికెట్‌ రేసులో ఉన్నారు. ఆమె చాపకింద నీరులా పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకుంటూ సహకరించాలని అభ్యర్థిస్తున్నారు. ఇటీవల మక్కువ మండలంలో సీనియర్‌ నాయకులు పెంట తిరుపతిరావు సహకారంతో ఆయనకు పట్టున్న గ్రామాల్లో పర్యటించారు. తనకు మద్దతు ఇస్తారనుకుంటున్న నాయకులను రహస్యంగా కలుస్తున్నారు. సంధ్యారాణి కూడా తన అనుచరులతో కలిసి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నారు.సంధ్యారాణిపై తీవ్ర ఆరోపణలుకొద్దిరోజుల క్రితం సీనియర్‌ నాయకులు పెంట తిరుపతిరావుపై టిడిపి మక్కువ మండల అధ్యక్షులు గుల్ల వేణుగోపాల్‌రావు విమర్శనాస్త్రాలు సంధించారు. దీనికి ప్రతిగా పెంట తిరుపతిరావు ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి సంధ్యారాణిపై పదునైన ఆరోపణాస్త్రాన్ని సంధించడం ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో వైసిపి నుంచి సంధ్యారాణి రెండు కోట్ల రూపాయలు తీసుకుని పార్టీకి వెన్నుపోటు పొడిచారని పెంట తిరుపతిరావు ఆరో పించారు. ఈ ఆరోపణలను తాను నిరూపిస్తానని సవాల్‌ విసురు తున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా భంజ్‌దేవ్‌ పోటీ చేశారు. ఆయన ఓటమికి సంధ్యా రాణి వైసిపితో చేతులు కలిపారనే వాదనను పెంట తిరుపతిరావు ఎన్నికల ముందు తీసుకురావడం దుమారం రేపుతోంది. నియోజకవర్గంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎలా నివారించాలనే దానిపై రాష్ట్ర నాయకత్వం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.తేజోవతిలో చిగురిస్తున్న ఆశలు టిడిపిలో నెలకొన్న తాజా పరిణామాలు తనకు లభిస్తాయనే ఆశతో తేజోవతి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల శంబర పోలమాంబ జాతర సందర్భంగా తన ఫ్లెక్సీలను చించివేయడం వెనుక నియోజకవర్గ ఇన్‌ఛార్జి సంధ్యారాణి అనుచరుల హస్తం ఉందనే విషయాన్ని ఆమె అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆర్‌పి భంజ్‌దేవ్‌తోపాటు బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబీనాయన ఆశీస్సులు కూడా తేజోవతికి ఉండడంతో ఆమెకు అనుకూల పరిణామంగా చెప్పొచ్చు.జనసేనకు జవసత్వాలు? బలమైన కేడర్‌ ఉన్నప్పటికీ గ్రూపు రాజకీయాల కారణంగా పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కుతున్న టిడిపి నాయకుల వ్యవహారాన్ని ఆ పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి గ్రూపు రాజకీయాలు చేరడంతో పార్టీ నాయకత్వం ప్రత్యామ్నాయ చికిత్సపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీ స్థానిక ఎమ్మెల్యే సీటుని కోరుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడి టికెట్‌ జనసేనకు కేటాయించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

➡️