టిడిపి ఆధ్వర్యాన మహిళా దినోత్సవ వేడుకలు

Mar 8,2024 19:43

 ప్రజాశక్తి-విజయనగరం కోట  :  మహిళా దినోత్సవ వేడుకలు టిడిపి కార్యాలయం అశోక్‌బంగ్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా టిడిపి- జనసేన ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని మాట్లాడారు. మహిళలను సమున్నత స్థానంలో ఉంచిన గర్వించదగిన దేశం మనది అని కొనియాడారు. మన రాష్ట్రంలో మహిళలకు ఆస్తి హక్కులో వాటా కల్పించిన ఘనత అన్న ఎన్‌టి రామారావుది అన్నారు. మహిళలకు రాత్రుళ్ళు బడులు పెట్టి అక్షరాలు దిద్దించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. ఈ సందర్బంగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన మహిళలను సత్కరించారు. కార్యక్రమంంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

‘కలలకు రెక్కలు’మహిళలకు వరం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళా సాధికారత దిశగా టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ కీలక ముందడుగు వేశారని నియోజకవర్గ ఇంఛార్జి పి.అదితి గజపతి, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని అన్నారు. అశోక్‌బంగ్లాలో మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘కలలకు రెక్కలు’ పథకం గురించి వివరించారు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ కూడా చదువుకు సంబంధించి డబ్బుల కొరతతో ఇంటికి పరిమితం కాకుకూడదనే ఆలోచనతో నూతన పధకాన్ని తీసుకుని వచ్చారని అన్నారు. మహిళలకు వత్తిపరమైన విద్యకు మార్గాలను అందించడంతో పాటు వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పధకం ప్రధాన లక్ష్యమన్నారు. ఇంటర్‌ పూర్తి చేసిన మహిళలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. మహిళలు తీసుకునే బ్యాంకు లోన్‌ కు తెలుగుదేశం – జనసేన ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత (హామీ) వహిస్తుందన్నారు. అర్హత ఉన్న మహిళలందరూ దేశంలో ఎక్కడైనా తమకు నచ్చిన ప్రొఫెషనల్‌ కోర్సులను అభ్యసించవచ్చునని అదితి విజయలక్ష్మి గజపతి వివరించారు.

➡️