టిడిపి టికెట్‌ ‘బత్యాల’కే…?

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ రాజంపేట అసెంబ్లీ టిడిపి టికెట్‌ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడికే వరించినట్లు సమాచారం. గురువారం బత్యాల పట్టణంలోని బలిజపల్లె గంగమ్మ ఆలయం వద్ద ఆయన అనుచరులు, అభిమానులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిడిపి కార్యకర్తలు, బత్యాల అనుయాయులు ఆలయం వద్ద బాణాసంచా పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. టికెట్‌ రేసులో ఉన్న టిడిపి రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్‌రాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి, మేడా విజయ శేఖర్‌రెడ్డి, పోలి సుబ్బారెడ్డి పేరు మీద ఐవిఆర్‌ ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. అయితే చివరకు బత్యాలకే టికెట్‌ వరించినట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో టిడిపి అధిష్టానం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ కారణంగానే బత్యాల బలిజపల్లి గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుని ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాజంపేట, రైల్వేకోడూరులోని బత్యాల చెంగల్రాయుడు వర్గీయులు, అభిమానులు గురువారం పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

➡️