టిడిపి మాయమాటలు నమ్మొద్దు

Jan 6,2024 21:16

ప్రజాశక్తి-పాచిపెంట: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టిడిపి నాయకులు బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ బూటకపు హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర ధ్వజమెత్తారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి, వారి మాయలో పడవద్దని ప్రజలను కోరారు. ఎవరైతే సుపరిపాలన అందిస్తున్నారో వారినే అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు శనివారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద వైఎస్‌ఆర్‌ పింఛను కానుక ద్వారా కొత్తగా మంజూరైన, పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను తూ.చ తప్పకుండా కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో చంద్రబాబు 65 ఏళ్లకు పింఛను ఇచ్చేవారని, ఇప్పుడు సిఎం జగన్మోహన్‌రెడ్డి 60 ఏళ్లకు, ఎస్‌టిలకు 50 ఏళ్లకు పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు. 80 శాతం వికలాంగత్వం ఉన్న వారికే చంద్రబాబు హయాంలో పింఛన్లు ఇస్తే.. ప్రస్తుతం 40 శాతం ఉన్న వారికీ పింఛను మంజూరు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం మండలంలో 7091 పింఛన్లు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి బి.ప్రమీల, జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ కె.సింహాచలం, వైసిపి మండల అధ్యక్షుడు గొట్టాపు ముత్యాలనాయుడు, పి.వీరమనాయుడు, డోల బాబ్జి, వైస్‌ ఎంపిపిలు ధనుంజరు, ఎం.నారాయణ, దండి శ్రీనివాసరావు, సలాది అప్పలనాయుడు, ఎంపిడిఒ పి.లక్ష్మీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రూ.3 వేలు పింఛను ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పి.పుష్ప శ్రీవాణి తెలిపారు. శనివారం స్థానిక బిఎస్‌ఆర్‌ కళింగ వైశ్య కళ్యాణ మండపంలో నూతన, పెంచిన పింఛన్లను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇతర పార్టీల నాయకులు చెబుతున్న కల్లబొల్లి మాటలను నమ్మొద్దన్నారు. కార్యక్రమంలో ఎంపిపి దీనమయ్య, డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్‌ కుమార్‌, ఎంపిడిఒ ఎస్‌.సాల్మన్‌రాజు, జెడ్‌పిటిసి మండంగి రాధిక, వైస్‌ ఎంపిపిలు నిమ్మక శేఖర్‌, మండంగి లక్ష్మణరావు పాల్గొన్నారు.పార్వతీపురం రూరల్‌ : వైసిపి పాలనలో పేదలకు సంపూర్ణ న్యాయం జరిగిందని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. శనివారం మండలంలోని వెంకంపేట పంచాయతీలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద పెంచిన రూ .3 వేలతోపాటు నూతనంగా మంజూరైన పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. మండలంలో కొత్తగా 183 పింఛన్లు మంజూరైనట్లు చెప్పారు. దీంతో మొత్తం పింఛన్ల సంఖ్య 10,752కు చేరిందన్నారు. కార్యక్రమంలో సర్పంచి తీళ్ల కృష్ణారావు మాధవ, జెడ్‌పిటిసి బలగ రేవతమ్మ, ఎంపిపి మజ్జి శోభారాణి, వైస్‌ ఎంపిపిలు రవికుమార్‌, సిద్ధా జగన్నాథరావు, మండల కన్వీనర్‌ బొమ్మి రమేష్‌, నాయకులు భీమవరపు కృష్ణమూర్తి, పలగ నాగేశ్వరరావు, మజ్జి చంద్రశేఖరరావు, గండి శంకరరావు, ఆత్మ చైర్మన్‌ వై.తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం : మండలంలోని పనస నందివాడ గ్రామంలో వైఎస్‌ఆర్‌ పింఛను కానుక ద్వారా పెంచిన, కొత్తగా మంజూరైన పింఛన్లను సర్పంచి బొమ్మాలి సరోజినీ, మాజీ సర్పంచి కె.సన్యాసినాయుడు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి బి.ప్రకాశ్‌రావు, ఎన్‌.రాంబాబు, ఉపసర్పంచి రౌతు లక్ష్మి, బి.జీవరత్నం, తదితరులు పాల్గొన్నారు.

➡️