డబుల్‌ ఎంట్రీ ఓట్లు ఇవిగో..

ప్రజాశక్తి – వినుకొండ : డబల్‌ ఎంట్రీ ఓట్లపై ఆధారాలతో బిఎల్‌ఒలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ఓటరు జాబితాలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ను కోరారు. వ్యవసాయ భూమి పట్టాల పంపిణీ కోసం పట్టణానికి గురువారం వచ్చిన కలెక్టర్‌ను తశీల్దార్‌ కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. షేక్‌ మౌలాలి, ఫరీజా దంపతుల ఓట్లు బూత్‌ నెంబర్‌-34, 207, 194 మూడు బూత్‌లలో ఓట్లు ఉన్నాయని, దేవెళ్ల రాము, పిచ్చమ్మ దంపతుల ఓట్లు బూత్‌ నంబర్‌ -274, 205లో ఉన్నాయని 255, 245, 46 బూత్‌లలో కుందేలు నరసింహకు ఓట్లు ఉన్నాయంటూ సుమారు 100 ఓట్లకు పైగా డబుల్‌ ఎంట్రీలు ఉన్నాయని జాబితాను కలెక్టర్‌కు చూపారు. వీటిని పరిశీలించిన కలెక్టర్‌.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన బిఎల్‌ఓలకు షోకాజ్‌ నోటీసుల జారీకి ఆదేశించారు. ఇలాంటి అవకతవకలు ఇంకా ఉంటో ఆధారాలను ఇవ్వాలని జీవీ ఆంజనేయులకు కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లోనైన బిఎల్వోలు, ఎన్నికల అధికారులు.. టిడిపి సానుభూ తిపరుల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు దొంగ ఓట్లను చేర్పి స్తున్నారని ఆరోపించారు. టిడిపి సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఫారం -7 దరఖాస్తు చేస్తున్నారని విమర్శించారు. దీనిపై చర్యలు తీసుకోకుంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో టిడిపి నాయకులు సుబ్బారావు, మురళికృష్ణ యాదవ్‌, బ్రహ్మయ్య, బి.గోవిందరాజులు, అజీజ్‌, అనీల్‌, ప్రశాంత్‌ ఉన్నారు.

➡️