డాక్టర్‌ జయరావు సేవలు చిరస్మరణీయం

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: డాక్టర్‌ దమ్ము జయరావు సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. దివంగత ఆర్‌ఎంపీ వైద్యులు డాక్టర్‌ దమ్ము జయరావు తృతీయ వర్థంతి సభ సోమవారం స్థానిక నారాయణస్వామి కాంప్లెక్స్‌లో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. జయరావు చిత్రపటానికి పూలమాలలు వేసి, జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తులు మాట్లాడుతూ కమ్యూనిస్టు భావజాలం కలిగిన డాక్టర్‌ జయరావు 1967 ప్రాంతంలో సిఎస్‌ పురం వచ్చి సైకిల్‌పై తిరుగుతూ మండలంలోని మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు సైతం వైద్య సేవలు అందించారని కొనియాడారు. పేద ప్రజల వద్ద ఎటువంటి ఫీజులు తీసుకోకుండానే వైద్యం అందించిన ఆదర్శమూర్తి జయరావు అన్నారు. జయరావు లాగా సామాజిక సేవ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని వక్తలు కోరారు. సిపిఎం సీనియర్‌ నాయకుడు సన్నపురెడ్డి తిరుపతిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్‌ పి వెంకటనరసయ్య, టిడిపి నాయకులు పాలకొల్లు వెంకటేశ్వరరెడ్డి, యుటిఎఫ్‌ నాయకులు ఎన్‌ వెంకట్రామయ్య, ఇర్ల కొండయ్య, ఏపీటీఎఫ్‌ మండల కార్యదర్శి జెఎస్‌ ఆనంద్‌బాబు, ఐద్వా నాయకురాలు ఉషా రాజ్యలక్ష్మి, కెవిపిఎస్‌ నాయకులు బి జేసురత్నం, డోల తిరుపతయ్య, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️