డెంటల్‌ విద్యార్థిని హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు

ప్రజాశక్తి – గుంటూరు లీగల్‌ : పెళ్లికి నిరాకరించిందనే కక్షతో యువతిని కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం, మణికొండకు చెందిన మన్నే జ్ఞానేశ్వర్‌కు జీవిత ఖైదు, రూ.6500 జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్‌.బి.జి పార్థసారథి సోమవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. హైదరాబాదులో ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేసే జ్ఞానేశ్వర్‌కు 2020 నవంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చిన్న అవుటుపల్లిలోని సిద్ధార్థ డెంటల్‌ కళాశాలలో బిడిఎస్‌ మూడవ సంవత్సరం విద్యార్థిని పిన్నమనేని తపశ్వినితో పరిచయం ఏర్పడింది. తపశ్విని హాస్టల్‌లో ఉంటుండగా తల్లిదండ్రులు ముంబైలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ అక్కడే ఉండేవారు. వీరి పరిచయం ప్రేమగా మారి 2021 మార్చిలో జ్ఞానేశ్వర్‌ హైదరాబాదులోని ఉద్యోగం వదిలి విజయవాడ వచ్చి ఇక్కడ మరో ప్రైవేట్‌ కంపెనీలో చేరాడు. తరచూ తపశ్విని వద్దకు కళాశాలకు వెళ్లి వస్తూ ఉండేవాడు. 2022 సెప్టెంబర్‌లో ఇద్దరూ కలిసి గన్నవరంలో ఓ గది అద్దెకు తీసుకొని కొంతకాలం కలిసున్నారు. ఆ సమయంలో తపస్విని వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసుకున్న జ్ఞానేశ్వర్‌ వాటిని రూ1.40 లక్షలకు తనఖా పెట్టి సొమ్ము చేసుకున్నాడు. జ్ఞానేశ్వర్‌ బైక్‌ కొనేందుకు రూ.37,500 చెల్లించగా మిగిలిన రూ.7500 తపశ్విని చెల్లించారు. కొంతకాలానికి జ్ఞానేశ్వర్‌ తపశ్వినిని అనుమానించటం ప్రారంభించగా ఆమె గన్నవరంలోని గది ఖాళీ చేసి తక్కెళ్లపాడులో నివాసం ఉంటూ సిబార్‌ డెంటల్‌ కళాశాలలో బీడీఎస్‌ మూడవ సంవత్సరం చదువుతున్న తన బాల్య మిత్రురాలైన చింతకింది విభ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో నవంబర్‌ 7న తపశ్విని వద్దకు వెళ్లిన జ్ఞానేశ్వర్‌ పెళ్లి చేసుకోవాలని, లేకుంటే చంపుతానని బెదిరించాడు. దీనిపై తపశ్విని నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు జ్ఞానేశ్వర్‌ను పిలిచి మందలించారు. అతను తాకట్టులో పెట్టిన బంగారాన్ని విడిపించి తపశ్వినికి ఇప్పించారు. పెళ్లికి నిరాకరించిందనే కక్షతో తపశ్వినిని చంపాలని జ్ఞానేశ్వర్‌ నిర్ణయించుకున్నాడు. 2022 డిసెంబర్‌ 5న కత్తి, సర్జికల్‌ బ్లేడ్లు కొని తన బైక్‌పై రాత్రి 8.30 గంటలకు తక్కెళ్లపాడులోని తపశ్విని ఉంటున్న ఇంటి వద్దకు వచ్చాడు. గదిలో ఉన్న తపశ్విని వద్దకు వెళ్లి పెళ్లి ఒత్తిడి చేయగా ఆమె నిరాకరించడంతో కత్తితో దాడికి దిగాడు. తపశ్విని ఎడమ వీపుపై పొడవటమే కాక సర్జికల్‌ బ్లేడ్లతో గొంతు చేతులపై తీవ్రంగా గాయపరిచాడు. ఆ గదిలోనే ఉన్న తపశ్విని మిత్రురాలు విభ గది నుండి బయటకు వచ్చి కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చారు. ఈలోగా జ్ఞానేశ్వర్‌ ఆ గదికి లోపల నుండి గడియ పెట్టి తాను సర్జికల్‌ బ్లేడుతో గొంతుపై కోసుకున్నాడు. చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టి జ్ఞానేశ్వర్‌ను కట్టివేశారు. 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా వారు వచ్చి తపశ్వినిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలిని అప్పటి పెదకాకాని సిఐ బి.సురేష్‌బాబు పరిశీలించి జ్ఞానేశ్వర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తపశ్విని మేనత్త డాక్టర్‌ కొల్లి మాధవి ఫిర్యాదు మేరకుజ్ఞానేశ్వర్‌పై హత్యా నేరం కింద పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐ మహేష్‌బాబు కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడు జ్ఞానేశ్వర్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించి జైలులో ఉంచి కేసు విచారణ చేపట్టింది. కోర్టులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సుల్తాన్‌ సిరాజుద్దీన్‌ ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు. జ్ఞానేశ్వర్‌కు ఉరి శిక్ష విధించాలని వాదించారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పార్థసారథి జీవిత ఖైదు విధించారు.

➡️