డోలిమోత.. కడుపుకోత

Jan 7,2024 22:00

గిరిశిఖర గ్రామాల్లో డోలిమోతలు నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వాలు మారినా గిరిజనుల బతుకులు మారడం లేదు. నేటికీ రహదారి సౌకర్యానికి నోచుకోకపోవడమే అందుకు కారణం. రోగాల బారిన పడిన గిరిశిఖర గ్రామాల ప్రజలు ఆస్పత్రులకు వెళ్లడం సాహసమే అవుతోంది. కిలోమీటర్ల మేర నడిచి వెళ్లడమో.. లేదంటే డోలికట్టి మోసుకెళ్లడమో నిత్యకృత్యమవుతోంది. అనారోగ్యానికి గురైన, నెలలు నిండిన గర్భిణులకు డోలీ మోతే శరణ్యమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. తాజాఞవ అలాంటి విషాదకర సంఘటనే చోటుచేసుకుంది. అత్యవసర వైద్యం అందక ఓ చంటిబిడ్డ మృతిచెందింది.

ప్రజాశక్తి-శృంగవరపుకోట : మండలంలో మూలబొడ్డవర పంచాయతీ పరిధిలోని చిట్టెంపాడు.. గిరిశిఖర గ్రామం. ఆ గ్రామానికి చెందిన మాదల గంగమ్మ, ఆమె చంటి బిడ్డకు శుక్రవారం తీవ్ర అనారోగ్యం కావడంతో భర్త గంగులు తోటి గిరిజనుల సహాయంతో వారిని డోలిపై వైద్యం కోసం పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్యులు తమ వద్ద సరైన వైద్య సౌకర్యాలు లేవంటూ ఎప్పటిలాగే విశాఖలోని కెజిహెచ్‌కు తల్లీ బిడ్డను రిఫర్‌ చేశారు. కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం రాత్రి చంటిబిడ్డ ప్రాణం గాల్లో కలిసిపోయింది.గిరిశిఖర గ్రామమైన చిట్టెంపాడు నుంచి కొండ దిగువకు తల్లీ బిడ్డను ఏడు కిలోమీటర్ల మేర డోలిపై తీసుకొచ్చారు. అక్కడ నుంచి స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చినా, సరైన చికిత్స అందలేదు. దీంతో విశాఖ కెజిహెచ్‌కు తరలించి, అక్కడ వారికి వైద్యం అందించే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే ఆలస్యం కావడంతో చంటిబిడ్డ మరణించింది. దీంతో చిట్టెంపాడు గ్రామంలో విషాదఛాయలు అలమకున్నాయి. మండలంలోని గిరిశిఖర గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించకపోవడంతో గిరిజనులకు ఏ చిన్న అనారోగ్యం చేసినా డోలిలో వారిని మోసుకుంటూ కిందకు వచ్చేసరికి వారి ప్రాణాలు గాలిలో కలిసిపోవడం నిత్యకృత్యంగా మారుతోంది. గిరిశిఖర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీలివ్వడమే తప్ప అధికారంలోకి వచ్చాక ఆచరణలో చిత్తశుద్ధిని కనబరచడం లేదు.ఎమ్మెల్సీ హామీనిచ్చినా..అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రఘురాజు సొంత పంచాయతీ మూలబొడ్డవర పరిధిలోని చిట్టెంపాడు గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. దారపర్తి పంచాయతీలోని 12 గిరిజన గ్రామాలదీ అదే పరిస్థితి. రహదారి సౌకర్యాలు లేక, డోలిమోత ద్వారా తీసుకెళ్లే సరికి ఆలస్యమై, సకాలంలో వైద్యం అందక మరణాలు సంభవిస్తున్నాయి. గతంలో ఎన్నో సందర్భాల్లో ఎమ్మెల్సీ రోడ్డు వేస్తానని హామీనిచ్చారు. కళ్లు కాయలు కాసేలా చూసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూలబొడ్డవర, దారపర్తి పంచాయతీల్లోని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలి.- జె.గౌరీష్‌, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు

➡️