‘తపాలా’ ప్రైవేటీకరణ ఆపాలి

ప్రజాశక్తి-మార్కాపురం:  కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. ఐక్య పోరాటాలతో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్‌-సి, (ఎన్‌ఎఫ్‌పిఇ) 40వ ద్వైవార్షిక రాష్ట్ర మహాసభలు మార్కాపురంలోని మాధవి గ్రాండ్‌ ఇన్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఇ శంకరనాయుడు అధ్యక్షతన ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సింగరావు మాట్లాడారు. నేటికీ మారుమూల ప్రాంతాలకు సైతం సేవలు అందిస్తున్న తపాలా శాఖను కేంద్రం ప్రయివేటీకరించాలనుకోవడం తగదని పేర్కొన్నారు. ప్రయివేటీకరణ ఆలోచనను గతంలో ఎన్‌ఎఫ్‌పిఇ పోరాటాలతో అడ్డుకుందన్నారు. మళ్లీ అదే ప్రయత్నంలో ప్రధాని మోడీ ఉన్నారని విమర్శించారు. తపాలా శాఖ ప్రయివేటీకరణను ప్రజా ఉద్యమంతో అడ్డుకోవాల్సిందేనన్నారు. ప్రయివేటీకరణ జరిగిందంటే అందులో దాచిన పేదల డబ్బుకు ప్రమాదమేనని హెచ్చరించారు. ప్రస్తుతం తపాలా శాఖలో రూ.5 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. పోస్టల్‌తో పాటు విశాఖ ఉక్కు, ఇతర ప్రభుత్వ సంస్థలను కాపాడుకునేందుకు కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ప్రజా సంఘాలను కలుపుకుని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి పాల్గొని మాట్లాడారు. తపాలా శాఖలో తమతో ఏదైనా సమస్య తీరుతుందనుకుంటే తాము సహకరిస్తామని అన్నారు. నేటికీ తపాలా శాఖ సేవలు మరువలేమన్నారు. తపాలా శాఖను ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎఫ్‌పిఇ ప్రతినిధులు, నాయకులు, తపాలా ఉద్యోగులు వందలాదిగా మార్కాపురం పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. అనంతరం జరిగిన మహాసభల్లో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్‌-సి కేంద్ర సంఘం నాయకులు శ్రావణ్‌ కుమార్‌, ఆర్‌ఎన్‌ శరత్‌కుమార్‌, అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్టుమేన్‌ అండ్‌ ఎంటిఎస్‌ కేంద్ర సంఘ కార్యదర్శి సిహెచ్‌ విద్యాసాగర్‌, అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం-జిడిఎస్‌ కేంద్ర సంఘ సహాయ కార్యదర్శి ఎం శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర గ్రూప్‌-సి అధ్యక్షులు మహిందర్‌, పోస్టుమేన్‌ అండ్‌ ఎంటిఎస్‌ రాష్ట్ర సంఘ అధ్యక్షులు మురళీ, పోస్టల్‌ అండ్‌ ఆర్‌ఎంఎస్‌ కేంద్ర, రాష్ట్ర సంఘ నాయకులు డి మోహనరావు, కె వెంకటేశ్వర్లు, ఎన్‌ నాగేశ్వరరావు తదితరులు అతిథులుగా హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌, అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్‌-సి సంఘాల గుర్తింపు రద్దు చేసిన నేపథ్యంలో సంఘాల గుర్తింపు తిరిగి పునరుద్ధరించే వరకు పోరాటాలను ఉధృతం చేయాలని కోరారు. ఈ మహాసభలకు మార్కాపురం డివిజనల్‌ సూపరింటెండెంట్‌ కె శ్రీనివాసు హాజరై మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం మహాసభలకు హాజరైన డెలిగేట్స్‌ గత రెండేళ్లలో జరిగిన పోరాట కార్యక్రమాలను చర్చించారు. ఈ మహాసభల ఏర్పాట్లను రిసెప్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎన్‌ రమణారెడ్డి, రిసెప్షన్‌ కమిటీ జెనరల్‌ సెక్రెటరీ బి శ్రీధర్‌బాబు పర్యవేక్షించారు.

➡️