తరుగు లేకుండా కొనుగోలు చేయాలి

Dec 9,2023 23:18
తరుగు

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌
తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ డిమాండ్‌ చేశౄరు. శనివారం కొవ్వూరు మండలం దొమ్మేరులో తుపాను వల్ల మొలకలు వచ్చిన ధాన్యపురాశులను ఆయన పరిశీలించారు. వరి పంట హార్వెస్ట్‌ చేసి ఆరబెట్టిన ధాన్యం తుపానుకు వల్ల కురిసిన వర్షాలకు తడిసిపోయిందని, కొంత శాతం ధాన్యం మొలకలు వచ్చాయని రైతులు తెలిపారు. గోనె సంచులు సరైన సమయానికి ఇచ్చివుంటే నష్టం కలిగేది కాదన్నారు. మిల్లర్లు ధాన్యాన్ని తరలించకపోవడం వల్లే తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బి.రాజులోవ మాట్లాడుతూ ధాన్యం తడిసిందనే పేరుతో బస్తాకి 6 నుంచి 10 కేజీలు తరుగు తీసేస్తున్నారని, మండల స్థాయిలో అధికార యంత్రాంగం ఇప్పటివరకు పాడైనా పంటను పరిశీలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన పంట నష్టాన్ని కలెక్టర్‌ కె.మాధవీలతకి ఫోన్‌లో రాజులోవ వివరించారు. మండల అధికారులను పంపిస్తామని, ధాన్యం కొనుగోలు చేస్తామని ఆమె చెప్పారన్నారు. మండలంలో అధిక సంఖ్యలో తడిచిన ధాన్యాన్ని రైతులు ఎండబెడుతున్నారని, అధికారులు ఇప్పటికైనా త్వరిత గతిన ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. తడిచిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా తరుగు లేకుండా కొనాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట రైతులు, కూలీలు ఉన్నారు.

➡️