తహశీల్దార్‌కు జీవీ ఆంజనేయులు క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే

ప్రజాశక్తి – వినుకొండ : శావల్యాపురం తహశీల్దార్‌ జాన్‌సైదులు పట్ల టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు వ్యవహరించిన తీరు బాధాకరమని, తహశీల్దార్‌కు ఆయన క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్‌ చేశారు. స్థానిక వైసిపి కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జీవీ ఆంజనేయులు తహశృల్దార్‌ను అసభ్య పదజాలంతో మాట్లాడటం బాధాకరమన్నారు. వైసిపి నాయకుల ఓట్లు తొలగించేందుకు టిడిపి నాయకులు దొంగ సంతకాలు చేసి షిఫ్టింగ్‌కు దరఖాస్తు చేశారని ఆరోపించారు. కారుమంచి గ్రామంలో 150 ఓట్లు బదలాయించేందుకు బొల్లా శివ, హనుమంతరావు ప్రయత్నించారని అన్నారు. వైసిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తూ అధికారులపై ప్రతిపక్ష నేతలు దౌర్జన్యం చేస్తున్నారని విమర్శించారు. నూజెండ్ల మండలం గుర్రపునాయుడుపాలెం, టి.అన్నారం, ముతరాజువారిపాలెం, కమ్మవారిపాలెం గ్రామాల్లో టిడిపి దొంగ ఓట్లు గతం నుండి వేస్తున్నారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో టిడిపి నియోజకవర్గంలో 15 వేల దొంగ ఓట్లు చేర్చుకున్నప్పటికీ ఆ ఓట్లు మాకే వేశారని అన్నారు. బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టిడిపి నిర్వహిస్తున్న కార్యక్రమం ఒక గారడీ అని, ఆ పార్టీ కార్యకర్తలకు ప్రజలు తమ పాన్‌ కార్డులు, ఆధార్‌, ఫోన్‌ నంబర్లు ఇవ్వవద్దని బ్రహ్మనాయుడు అన్నారు. సమావేశంలో వైసిపి నాయకులు పిఎస్‌ ఖాన్‌, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌లు చిన్నబ్బాయి, చుండూరి వెంకటేశ్వర్లు, నక్క నాగిరెడ్డి పాల్గొన్నారు.

➡️