తాగునీటికి కటకట

ప్రజాశక్తి – కొండాపురం చుట్టూ నీరున్నా.. మండలంలోని ప్రజలకు మాత్రం తాగునీటి కష్టాలు తప్పడంలేదు. మండలంలోని 21 గ్రామాలతోపాటు ముద్దనూరు మండలంలోని కొర్రపాడు కూడా గండికోట ప్రాజెక్టులో నీరు నిలుపుట కోసం త్యాగం చేశారు. కానీ ఆ ప్రజలే నేడు తాగునీటికి కటకటలాడాల్సి వస్తోంది. మండల ప్రజలతోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు కడప, అనంతపురం, చిత్తూరు ప్రజలకు కూడా సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మండలంలో ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ప్రజలకు మాత్రం నీటి ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని అన్ని గ్రామాలకి నీటి సరఫరా కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నీటి సరఫరా కోసం సిపిడబ్ల్యూసి పథకం ఏర్పాటు చేశారు. ఈ పథకంలో గండికోట ప్రాజెక్టు నుండి కొండాపురం, ముద్దనూరు మండలాల్లో నీరు సరఫరా చేయాల్సినవి. ఈ పథకం ఆదిలోనే కొన్ని రోజులు మాత్రమే నీటి సరఫరా చేశారు.. కానీ రెండేళ్లుగా కొండాపురం మండల వాసులను నీటి సమస్య వెంటాడుతోంది. జాతీయ రహదారి పనులు చేస్తున్న సిఆర్‌ అసోసియేషన్‌ సంస్థ నీటి సరఫరా పైపులైన్‌ను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నీటి సరఫరా పునరుద్దరించి పనులను చేసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా పైపులైన్‌ తొలగించడం వల్ల నీటి సరఫరా ఆగిపోయింది. ఈ సమస్యలను పరిష్కారించాలని సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని, చివరకు గడపగడపకూ మనప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా కలెక్టరు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

➡️