తాటాకు చప్పుళ్లకు భయపడం

Feb 9,2024 20:41

ప్రజాశక్తి-నెల్లిమర్ల : మిమ్స్‌ యాజమాన్య తాటాకు చప్పుళ్లకు ఉద్యోగులు, కార్మికులు భయపడరని మిమ్స్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు టి.వి.రమణ స్పష్టం చేశారు. స్థానిక ఆర్‌ఒబి వద్ద ఆ యూనియన్‌ ఆధ్వర్యాన మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన నిరసన శిబిరం శనివారం పదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా శిబిరంలో రమణ మాట్లాడుతూ మిమ్స్‌ యాజమాన్యం బెదిరింపులకు తలొగ్గే పరిస్థితి లేదన్నారు. మిమ్స్‌ యాజమాన్యం ట్రేడ్‌ యూనియన్‌ నాయకులతో చర్చలు జరపబోమని చెప్పడం అర్థ రహితమన్నారు. సిఐటియు నాయకత్వం లేకుంటే ఉద్యోగులు, కార్మికుల నోళ్లు నొక్కి, డిఎలు, వేతన ఒప్పందం ఎగ్గొట్టవచ్చని మిమ్స్‌ యాజమాన్యం ఎత్తుగడ వేసిందన్నారు. సిఐటియు నాయకత్వం, మిమ్స్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌తో చర్చలు జరిపి, సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఈ పోరాటానికి ప్రజలంతా మద్దతు పలకాలని కోరారు. శిబిరంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కిల్లంపల్లి రామారావు, ఉద్యోగులు మిరప నారాయణ, కర్రోతు కాము నాయుడు, మహంతి నాగభూషణం, వి.అప్పలనాయుడు, టి.రామకృష్ణ, కె.నాగేశ్వరరావు, జి.వరలక్ష్మి, బి.బంగారు నాయుడు, వి.భవాని తదితరులు పాల్గొన్నారు.

➡️