తాళాలు ధ్వంసం..

అమరావతిలో అంగన్వాడీ కేంద్రం తాళాన్ని పగలగొట్టిస్తున్న తహశీల్దార్‌
ప్రజాశక్తి – పల్నాడు జిల్లా విలేకర్లు :
సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్న నేపథ్యంలో కేంద్రాలను తాళలు పగలగొట్టయినా తెరవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో శుక్రవారం పల్నాడు జిల్లాలోని పలుచోట్ల కేంద్రాలను సచివాలయ, ఇతర శాఖల సిబ్బంది తెరిపించారు. పలుగులు, రాడ్‌ కట్టర్లను తెప్పించి తాళాలను పగలగొట్టించడం, కోయించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా వినుకొండ పట్టణంలోని పలు కేందాల తాళాలను అధికారులు, సచివాలయ ఉద్యోగులు పగలగొట్టించారు. బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల, గుమ్మనంపాడు, మేళ్లవాగు, రావులాపురం అంగన్వాడి కేంద్రాల తాళాలను పీడీ బి.అరుణ దగ్గరుండి పగలగొట్టించి లోపలికి వెళ్లౄరు. వినుకొండ పట్టణంలో పీడీతోపాటు మున్సిపల్‌ కమిషనర్‌ వెంకయ్య, సూపర్వైజర్లు, సచివాలయ ఉద్యోగులు సమక్షంలో పోలేరమ్మ గుడి సెంటర్‌ వద్ద 77వ కేంద్రం, విద్యానగర్లోని 83వ కేంద్రానికి తాళాలు బద్దలు కొట్టించారు. ఆయా సెంటర్లోని రికార్డులు, పౌష్టిక ఆహారం, కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని మరో వారు తెచ్చిన తాళాలను మళ్లీ కేంద్రాలకు వేసి వెళ్లిపోయారు. ఇది తెలిసిన అంగన్వాడీలు అదే కేంద్రాల వద్ద నిరసన తెలిపారు. మండల కేంద్రమైన ముప్పాళ్లలోని అంగన్వాడి కేంద్రాల తాళాలను వీఆర్వో, సచివాలయాల సిబ్బందితో ఐసిడిఎస్‌ పల్నాడు జిల్లా పీడీ అరుణ పగలగొట్టించారు. వాటిల్లోని సరుకు నిల్వలను రికార్డుల్లో నమోదు చేయించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిడిఒతో సమావేశమయ్యారు. కొందరు అంగన్వాడీ కార్యకర్తలను పిలిపించి బెదిరింపు ధోరణితో మాట్లాడారు. కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను పట్టించుకోకుండానే వెళ్లిపోయారు. సత్తెనపల్లి పట్టణంలోని పలు కేంద్రాల తాళాలను సచివాలయ సిబ్బంది పగలగొట్టించారు. ఈ చర్యను ఖండిస్తూ తహశీల్దార్‌కు అంగన్వాడీలు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడు ఎస్పీ కాలనీలోని రెండు కేంద్రాల తాళాలను సచివాలయ సిబ్బంది పగలగొట్టారు. కేంద్రంలోని సరుకును పంచాయతి కార్యదర్శి, విఆర్‌ఒ, ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రమైన అమరావతిలోని గోపాల్‌నగర్‌ సమీపంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం తాళాలను తహశీల్దార్‌ విజయశ్రీ, ఇఒపిఆర్‌డి కె.గంగాధర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పగలగొట్టారు. వీఆర్వో సురేష్‌, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, సచివాలయ సిబ్బందితో కలిసి గేటు తాళాలు, రూము తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. నాదెండ్ల మండలం ఈర్లపాడులో కేంద్రాన్ని సచివాలయ సిబ్బంది పగలగొట్టారు.

➡️