తూర్పులో రాజకీయ వేడి

తూర్పులో రాజకీయ వేడి

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయం వేడెక్కుతుంది. గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు సాగుతున్నాయి. అధికారం చేపట్టేందుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. దీనిలో భాగంగా అధికార వైసిపి ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాపై కసరత్తులు దాదాపుగా పూర్తి చేసింది. కొన్ని స్థానాల అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా మరికొన్నింటిని పెండింగ్‌లో ఉంచింది. ఈ నెల 20 తేదీలోపే వాటిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సందర్భంలో జనసేన, టిడిపి పొత్తలో ఉండగా సీట్ల సర్దుబాటు అంశంపై ఇంకా ఇరు పార్టీల మధ్య క్లారిటీ కనిపించడం లేదు. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఏప్రిల్‌లో అనుకున్న సమయానికి సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటనపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఆ పార్టీల ఆశావహుల్లో టెన్షన్‌ వాతావరణ నెలకొంది. అధికార వైసిపి అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. గెలుపు గుర్రాలపై ఫోకస్‌ పెట్టింది. దానిలో భాగంగానే కాకినాడ జిల్లాలో పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట సిట్టింగ్‌ ఎంఎల్‌ఎలు పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌, జ్యోతుల చంటిబాబు స్థానాల్లో కాకినాడ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, మాజీ మంత్రి తోట నరసింహంకు టికెట్లను ఇటీవల కన్ఫర్మ్‌ చేసింది. కాకినాడ సిటీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, రూరల్‌ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ కురసాల కన్నబాబు, తుని నుంచి మంత్రి దాడిశెట్టి రాజా, పెద్దాపురం నుంచి దవులూరి దొరబాబు పోటీలో వుండనున్నారు. వీరి అభ్యర్థిత్వం కూడా దాదాపుగా ఖరారు అయినట్లే. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నుంచి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌, రూరల్‌ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకష్ణలను ఖరారు చేస్తూ ఇటీవల అధిష్టానం ప్రకటించింది. రాజానగరం నుంచి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా, అనపర్తి నుంచి సత్తి సూర్యనారాయణ రెడ్డి, నిడదవోలు నుంచి శ్రీనివాస నాయుడు, కొవ్వూరు నుంచి తానేటి వనిత పోటీలో ఉండనున్నారు. దీనిపై అధిష్టానం ప్రకటనే తరువాయి. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో అధికార పార్టీ నుంచి ఇప్పటికే పి.గన్నవరం నియోజకవర్గ నుంచి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ కొండేటి చిట్టిబాబు స్థానంలో జెడ్‌పి చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, రామచంద్రపురంలో మంత్రి వేణు స్థానంలో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్‌కు అధికారికంగా టిక్కెట్లను ఖరారు చేసింది. అమలాపురం నుంచి మంత్రి పినిపే విశ్వరూప్‌ లేదా ఆయన కుమారుడు శ్రీకాంత్‌కు టికెట్‌ కేటాయించే అవకాశం ఉంది. ముమ్మిడివరం నుంచి పొన్నాడ సతీష్‌ కుమార్‌కు, రాజోలు రాపాక వరప్రసాద్‌కు, కొత్తపేట చిర్ల జగ్గరెడ్డికి, మండపేట తోట త్రిమూర్తులుకు దాదాపుగా టికెట్లు ఖరారు అయ్యాయి.టిడిపి, జనసేనలో రాని స్పష్టతటిడిపి జనసేన పొత్తులో ఉండగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు అంశంపై రెండు పార్టీలు ఇంకా క్లారిటీకి రాలేదు. జనసేన కాకినాడ రూరల్‌, పిఠాపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, రాజమండ్రి రూరల్‌, రాజానగరం, కొత్తపేట అసెంబ్లీ స్థానాలను అడుగుతున్నట్లు సమాచారం. దీనిపై ఇరు పార్టీల మధ్య ఇంకా సఖ్యత కుదరలేదు. ఒకవేళ ఆ పార్టీ ఆశించినట్లుగా ఇక్కడ టికెట్లు కేటాయిస్తే కాకినాడ రూరల్‌ నుంచి పంతం నానాజీ, పిఠాపురం నుంచి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్‌, ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ, రాజోలు నుంచి బొంతు రాజేశ్వరరావు, రాజమండ్రి రూరల్‌ నుంచి కందుల దుర్గేష్‌, రాజానగరం నుంచి బత్తుల బలరామ్‌, కొత్తపేట నుంచి బండారు శ్రీనివాస్‌ పోటీలో ఉండే అవకాశం ఉంది. జనసేనకు మూడు జిల్లాల్లోనూ కాకినాడ రూరల్‌, పిఠాపురం, రాజోలు, ముమ్మిడివరం, రాజమండ్రి రూరల్‌, రాజానగరం వంటి 6 స్థానాలను మాత్రమే కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సీట్ల సర్దుబాటు గనుక పూర్తయితే కాకినాడ జిల్లాలో టిడిపి తరపున తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య, కాకినాడ సిటీ నుంచి మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు, పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప, ప్రత్తిపాడు నుంచి వరుపుల రాజా సతీమణి సత్యప్రభ, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ బరిలో నిలవనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీ నుంచి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ ఆదిరెడ్డి భవాని, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కొవ్వూరు నుంచి మాజీ మంత్రి జవహర్‌, నిడదవోలు నుంచి బూరుగుపల్లి శేషారావు, గోపాలపురం నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావులు పోటీలో ఉండే అవకాశం కనిపిస్తోంది. అటు అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురం అసెంబ్లీ బరిలో ఆనందరావు, ముమ్మిడివరం నియోజవర్గం నుంచి దాట్ల బుచ్చిబాబు, పి.గన్నవరం బరిలో హరీష్‌, రామచంద్రాపురం నుంచి సత్య స్కాన్‌ అధినేత కాదా వెంకటరమణ, మండపేట నుంచి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావులు బరిలో నిలుచునే అవకాశం ఉంది. అయితే టిడిపి అధిష్టానం వీరిని ఇంకా ఖరారు చేయలేదు. ఇదిలా ఉండగా రెండు పార్టీల్లోనూ సీట్ల సర్దుబాటు అంశం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కూడా ఉంది.

➡️