రైల్వే జోన్‌ ఇంకెంత దూరం..!

Jun 29,2024 00:59 #East Coast Railway, #railwayzone
విశాఖ రైల్వే స్టేషన్‌ (ఫైల్‌ ఫొటో)

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో

మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు అంశం మళ్లీ తెరమీదకు వస్తోంది. రాష్ట్రంలో భారీ మెజారిటీతో ‘కూటమి’ పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బిజెపి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి అభ్యర్థులే విజయఢంకా మోగించారు. వారంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైల్వే జోన్‌ ఆవశ్యకతను ప్రస్తావించారు. ఇప్పుడు గెలిచారు కాబట్టి.. వారు కథలు చెప్పి తప్పించుకోడానికి అవకాశం లేదని పలువురు భావిస్తున్నారు. వాస్తవానికి విశాఖకు రైల్వే జోన్‌ అర్హత ఏనాడో ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్‌ప్లాంట్‌, పోర్టు, షిప్‌యార్డు సహా పలు కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. రైల్వే జోన్‌ పనులు ప్రారంభిస్తున్నామన్న కనీస సంకేతం కింద జోన్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టు అయినా తక్షణం కేటాయిచాల్సి ఉంది. అయితే ఆ దిశగా నూతన ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఒక్క అడుగూ పడలేదు. రెండు స్థలాలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపడం లేదంటూ గతంలో బిజెపి కేంద్ర మంత్రులు ఆరోపించడం తెలిసిందే. విశాఖ రైల్వే డిఆర్‌ఎం కార్యాలయం వెనక భాగంలో 30 ఎకరాల వరకూ స్థలం సిద్ధంగా ఉంది. గతంలో బిఆర్‌టిఎస్‌ కోసం రైల్వే నుంచి 26 ఎకరాలను జివిఎంసి తీసుకోగా దానికి ప్రత్యామ్నాయంగా ముడసర్లోవ వద్ద సర్వే నెంబరు 57 నుంచి 59 పి, 61 పి, 62 పి, 63, 64, 65ల్లో 52 ఎకరాలను కేటాయిస్తూ రైల్వేకు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. దీంట్లో ఇప్పటికీ 27 ఎకరాల వరకూ క్లియర్‌ భూమి సిద్ధంగా ఉంది. కావాలనే కేంద్రంలోని బిజెపి సర్కారు జాప్యం చేస్తూ జోన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టడం లేదు. 2016-17లో రైల్వే డివిజన్‌ కేంద్రాన్ని ఇక్కడ నుంచి ఎత్తేసింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ విశాఖకు ఇస్తున్నట్లు ప్రకటించి ఉన్న వాల్తేరు రైల్వేను వెనక్కి లాగేసింది. విశాఖకు 200 కిలోమీటర్లలోపు విజయవాడ డివిజన్‌ ఉండగా వాల్తేరు రైల్వే వేరేగా ఎందుకు ? అనేది కేంద్రం వాదన. విజయవాడకు 40 కిలోమీటర్ల దూరమే గుంటూరు.. అలాంటప్పుడు డివిజన్‌ అదెందుకు అనే ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. అడ్డగోలుగా వాల్తేరు రైల్వేకు ఉద్వాసన పలికి జోన్‌ కూడా ఇవ్వడం లేదు. కొత్తగా రైల్వే జోన్‌ ఇచ్చిన ఎక్కడా కూడా దేశంలో డివిజన్‌ను ఎత్తేయలేదు. రైల్వే ఆస్తులకు విశాఖ కేంద్రంవిశాఖ కేంద్రంగా కంచరపాలెంలో రైల్వే కోచింగ్‌ కాంప్లెక్స్‌ ఉంది. ఎలక్ట్రికల్‌ లోకో షెడ్‌, డీజిల్‌ లోకో షెడ్‌ ఇక్కడే ఉన్నాయి. వడ్లపూడిలో రైల్‌ వ్యాగన్‌ వర్క్‌షాప్‌ ఉంది. వందల సంఖ్యలో ఆఫీసర్లు, ఉద్యోగులు ఆయా సెంటర్లలో పనిచేస్తున్నారు. డివిజన్‌ను తీసేసినా ఆ ఆస్తులు ఇక్కడ ఉన్నందున వారంతా ఇక్కడే పనిచేయాలి. రైల్వే డివిజనల్‌ ఆసుపత్రి కూడా విశాఖలోనే ఉంది. డివిజన్‌ లేకుండా చేయాలనే కుట్ర తప్ప ఎంత మాత్రమూ కేంద్ర నిర్ణయం సముచితం కాదు. విశాఖలో రెండు పోర్టులున్నాయి. స్టీల్‌ప్లాంట్‌, ఇతర పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతుల విషయంలో సమన్వయం చేసుకోడానికి అడిషనల్‌ డిఆర్‌ఎం స్థాయి అధికారి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. డివిజన్‌ లేకుండా చేసి వాల్తేరు స్థాయిని తగ్గించే బిజెపి కుట్రలపై కూటమి పార్టీల నేతలు ప్రశ్నించకపోతే విశాఖకు తీవ్ర అన్యాయం చేసిన వారవుతారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

 

➡️