తెనాలిలో దీక్షలు చేస్తున్న లాయర్లు

భూ హక్కు చట్టంపై జీవో 512ను రద్దు కోసం లాయర్ల దీక్షలు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా, తెనాలి : ప్రజల ఆస్తులకు రక్షణలేని భూ హక్కు చట్టాన్ని, దానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 512ను తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కేంద్రమైన నరససరావుపేటలోని స్టేషన్‌ రోడ్డులో, గుంటూరు జిల్లా తెనాలిలోని కోర్టు భవనాల ఎదుట రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. నరసరావుపేట, తెనాలి బార్‌ అసోసియేషన్ల అధ్యక్షులు ఎం.నాగేశ్వరరావు, ఎం.వేణుగోపాలరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులు, పట్టణ ప్రాంతాలలో స్థిరాస్తులు గలవారి హక్కులకు భంగం కలిగించేలా ఉన్న భూ హక్కు చట్టం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. భూ హక్కు చట్టాన్ని రద్దు చేసే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని, విధులు బహిష్కరణను కొనసాగిస్తామని హెచ్చరించారు. భూహక్కులు నిర్థారణలో న్యాయ పరిజ్ఞానం లేని ప్రభుత్వాధికారులకు చట్టంలో ప్రాధాన్యతలు తెలియవని విమర్శించారు. దీక్షల్లో న్యాయవాదులు, టి.అమూల్య, చండ్ర రాజేశ్వరరావు, కె.కిరణ్‌ తేజ, షేక్‌ జిలాని, కె.భారతి, ఎం.భూదేవి, పి.కరీమ్‌ఖాన్‌, ఐ.రాణి, హెచ్‌.గౌరీశంకర్‌, జి.సురేష్‌, ఎ.పిన్నారావు, బి.ప్రభాకర్‌, జి.జయరామకృష్ణ, సురేష్‌ పాల్గొన్నారు.

➡️