తెలుగు తమ్ముళ్ల సిగపట్లు

తెలుగు తమ్ముళ్ల సిగపట్లు

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధితూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా టిడిపిలో ఆదిపత్య పోరు కొనసాగుతోంది. కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌లోని నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరులో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఈ మూడు నియోజకవర్గాల్లో టిడిపికి బలమైన పునాది ఉన్నప్పటికీ 2019 ఎన్నికల్లో ఓటమి చవి చూడక తప్పలేదు. వైసిపి అభ్యర్థుల గెలుపునకు వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర ప్రభావంతో పాటు టిడిపిలో ఆధిపత్య పోరు ఓటమికి ప్రధాన కారణం అంటున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో బూరుగుపల్లి శేషారావు 2009లోనూ, 2014లో రెండుసార్లు ఎంఎల్‌ఎగా గెలిచారు. అదే నియోజకవర్గంలో ప్రముఖ వ్యాపారవేత్త కుందుల సత్యనారాయణ 2019లో టికెట్‌ ఆశించారు. బూరుగుపల్లి శేషారావు సీనియర్‌ కావడంతో అధినేత ఆయన వైపే మొగ్గు చూపించారు. కుందుల సత్యనారాయణకు పెరవలి మండలంలో పట్టు ఉంది. బూరుగుపల్లి శేషారావుకు గత ఎన్నిల్లో సహకరించకపోవడంతో ఓటమి తప్పలేదని సుస్పష్టం. అమరావతి రాజధాని రైతుల యాత్ర, యువనేత నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఇద్దరు నేతలూ పోటా పోటీగా తమ సహాయసహకారాలు అందించారు. అధినేత చంద్రబాబు శేషారావువైపు, లోకేష్‌ కుందుల సత్యనారాయణ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ ప్రాంతలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. ఉండ్రాజవరం మాజీ సర్పంచ్‌గా గతంలో సేవలందించారు. ప్రముఖ సినీ నిర్మాత కావడంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ నియోజకవర్గం కోరుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ టిడిపి, జనసేన కూటమి కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. గోపాలపురం నియోజకవర్గంలో 1983, 85, 89 వరుసగా మూడు ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కారుపాటి వివేకానంద గెలుపొందారు. 1994, 99 రెండు ఎన్నికల్లోనూ టిడిపి అభ్యర్థి జొన్నకూటి బాబూజీరావు గెలుపొందారు. 2009లో తానేటి వనిత, 2014లో ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. ఘన చరిత్ర ఉన్న ఈ నియోజక వర్గంలో ముప్పిడి వెంకటేశ్వరరావు స్థానికంగా ముఖ్యనాయకులను కలుపు లేకపోవడం, నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవటం వంటి కారణాలతో 2019లో ఓటమి పాలయ్యారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తాజా ఎన్నికల్లో మద్దిపాటి వెంకటరాజుకు టికెట్‌ ఇచ్చే యోచనలో ఉన్నారు. మద్దిపాటి వెంకటరాజుకు స్థానికంగా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు ఇటీవల 400 కార్లతో మద్దిపాటి వద్దు ఎవరైనా మాకు ముద్దు అనే నినాదంతో అమరావతి వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి లోకల్‌గా స్పందన లభించలేదు. తాజా పరిణామాలు గత పరిస్థితులను పునరావృతం చేసేలా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి దొడ్డిగర్ల సువర్ణ రాజు టికెట్‌ ఆశిస్తున్నారు. 2014లో వైసిపి టికెట్‌ కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి జవహర్‌, అదే పార్టీలో మద్దిపట్ల శివరామకృష్ణ రెండు వర్గాలుగా చీలిపోయారు. కొవ్వూరు రామా సొసైటీ అధ్యక్షునిగా, ప్రస్తుతం అర్బన్‌ బ్యాంక్‌ అధ్యక్షులుగా మద్దిపట్ల కొనసాగుతున్నారు. 1983, 85, 89, 94లో పెండ్యాల వెంకట కృష్ణారావు తెలుగుదేశం నుంచి వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. 2004లో మరోసారి గెలిచి విజయఢంకా మోగించారు. 2009లో టివి.రామారావు, 2014లో కెఎస్‌ జవహర్‌ తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. తెలుగుదేశం కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2014 అనంతరం రెండేళ్లకే వర్గ విబేధాలొచ్చాయి. ఆధిపత్య పోరు కొనసాగింది. ఈ నేపథ్యంలో 2019లో టిడిపికి ఓటమి తప్పలేదు. అయితే ఈ ఐదేళ్లలోనూ పరిస్థితిని అధినేత చక్కదిద్దలేకపోయారు. ఇరు గ్రూపుల్లో ఒకరి చొప్పున నియోజక వర్గ త్రిసభ్య కమిటీ వేసినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో టిడిపి నుంచి టికెట్‌ ఆశించే వారి సంఖ్య ఘణనీయంగా ఉంది. గోపాలపురం మాజీ ఎంఎల్‌ఎ ముప్పిడి వెంకటేశ్వరరావు, ప్రముఖ బిల్డర్‌ రాపాక శ్రీనివాసరావు, ప్రముఖ కాంట్రాక్టరు గడ్డం గంగాచలం, రిటైర్డ్‌ హాస్టల్‌ వార్డెన్‌ పెనుపాక జయరాజు, ప్రముఖ వ్యాపారవేత్త వేమగిరి వెంకటరావు, ప్రముఖ కాంట్రాక్టర్‌ ముప్పిడి రాజు, కొప్పాక జవహర్‌ తదితరులు టిడిపి అధినేత ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాజీ ఎంఎల్‌ఎ టివి.రామారావు టికెట్‌ ఆశిస్తున్నారు. గతంలో టిడిపి తరుపున 2009లో గెలుపొందారు. 2014లో టికెట్‌ ఇవ్వలేదని పార్టీని వీడారు. అనంతరం వైసిపి తాజాగా జనసేనలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో వర్గపోరు అధిగమించకపోతే కూటమి అభ్యర్ధులకు 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

➡️