తేలని టికెట్‌ పంచాయితీ

Mar 25,2024 21:47

ప్రజాశక్తి-పాలకొండ : నియోజకవర్గంలో టిడిపి తరపున టికెట్‌ విషయంలో నేటికీ స్పష్టత రాలేదు. మొదటి నుంచి టికెట్‌ ఆశిస్తున్న టిడిపి నియోజకవర్గ సమన్వయకర్త నిమ్మక జయకృష్ణకు టికెట్‌ విషయంలో స్పష్టత రానట్టు తెలుస్తుంది. మొదటి నుండి జయకృష్ణకు వ్యతిరేకంగానే నియోజకవర్గ పరిధిలో కొందరు నేతలున్నారు. మాజీ జడ్పీటీసీ సభ్యులు సామంతుల దామోదరరావు, మాజీ ఎంపిపి ప్రతినిధి వారాడ సుమంత్‌ నాయుడు, మాజీ జడ్పీటీసీ ప్రతినిధి ఖండాపు వెంకటరమణతో పాటు మరికొందరు నేతలు బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే మూడు నెలల క్రితం అమరావతిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జయకష్ణతో పాటు పాలకొండ నియోజకవర్గంలో ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి గ్రూపుల్లేకుండా పని చేయాలని, నాయకులందర్ని కలుపుకుని పోవాలని జయకృష్ణకు సూచించినప్పటీకీ ఆ దిశగా ఆయన సఫలీకృతం కాలేకపోతున్నారు. దీంతో పార్టీలో గ్రూపుల గోల ఎక్కువవ్వడంతో అభ్యర్థి ఎంపిక పార్టీ అధినేతకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది. పొత్తుల్లో భాగంగా పాలకొండ సీటు జనసేనకు కేటాయించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జనసేనలో ఉన్న నాయకులెవరూ పోటీకి ముందుకు రాకపోవడంతో టిడిపిలో ఉన్న అశావాహుల్లో ఒకరిని ఎంపిక చేసుకోవాలని ఇరు పార్టీల నేతలు కూడా భావిస్తున్నట్టు సమాచారం. మొన్నటి వరకు తెలుగుదేశంలో ప్రచారం చేసిన తేజోవతి జనసేనలో చేరి టికెట్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జయకృష్ణ కూడా పొత్తుల్లో భాగంగా జనసేన తరపున ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే టిడిపిలో జయకృష్ణ వ్యతిరేక గ్రూపునకు చెందిన పడాల భూదేవి కూడా టికెట్‌ వస్తుందన్న ఆశగా చూస్తున్నారు. గత రెండు రోజులుగా జనసేన తరపున నియోజకవర్గనికి సంబంధించి ఐవిఆర్‌ఎస్‌ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో పడాల భూదేవి పేరు ఒక్కటే సూచించడం కూడా భూదేవినే జనసేన అభ్యర్థి అని చర్చ జరుగుతోంది. అలాగే భూదేవికి మద్దతుగా ఉన్న నియోజకవర్గ నేతలు అమరావతిలో మకాం వేయడంతో నియోజకవర్గ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏది ఏమైనా ఎన్‌డిఎ కూటమి అభ్యర్థి విషయంలో స్పష్టత రాకపోవడంతో కేడర్‌లో అయోమయం నెలకొంది.

➡️