తొమ్మిది రకాల నిత్యావసరాలను ఇవ్వండి

సత్తెనపల్లి: కందిపప్పుతో పాటు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతి కార్డుదారునికి సరఫరా చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ( ఐద్వా) సత్తెనపల్లి పట్టణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు తహసిల్దార్‌ సురేష్‌ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా పట్టణ కార్యదర్శ గద్దె ఉమాశ్రీ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ప్రతి కార్డుదారునికి కేజీ కందిపప్పు ఇవ్వడం జరిగేదని కానీ ప్రస్తుతం కందిపప్పు రేషన్‌ దుకాణాలలో ఇవ్వడం లేదని అన్నారు. ప్రస్తుతం బయట మార్కెట్లో కందిపప్పు ధర కేజీ రూ.70 నుండి రూ.170 కు పెరగడంతో పేదలు మార్కెట్లో కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కూలి పనులు చేసుకుని జీవించే పేదలు రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారని అటువంటి వారికి ప్రభుత్వం కందిపప్పు సరఫరా చేయకపోవడంతో తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. బయట మార్కెట్లో అన్ని రకాల నిత్యవసర వస్తువులు ధరలు 100 శాతం నుండి 200 శాతం వరకు పెరిగాయని ఈ నేపథ్యంలో ప్రభుత్వం కందిపప్పుతో పాటు తొమ్మిది రకాల నిత్యవసర వస్తువులు ధరలు రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతి కార్డుదారునికి సరఫరా చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు మునగాజ్యోతి, ధరణికోట విమల, గుంటుపల్లి రజిని, సావిత్రి, శ్రీదేవి, చేనేత కార్మిక సంఘం నాయకులు కట్టా శివ దుర్గారావు, గింజుపల్లి మస్తాన్‌రావు పాల్గొన్నారు.

➡️