దళితుల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్ర

ప్రజాశక్తి-శింగరాయకొండ : ఎన్నికల నేపథ్యంలో బిజెపి, టిడిపి జనసేన కూటమిగా ఏర్పడి దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి మాటలు విని దళితులు మోస పోవద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మేరుగ నాగార్జున తెలిపారు. స్థానిక గంజి వారి కళ్యాణ మండపంలో కొండపి నియోజకవర్గ స్థాయి దళితుల సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ కొండేపి నియోజకవర్గంలో దళితుల మధ్య టిడిపి చిచ్చు పెట్టడం ప్రారంభించినట్లు తెలిపారు. వైసిపిలో ఉన్న దళితులు ఆ చిచ్చులో పడవద్దని తెలిపారు. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల స్థితిగతులు మెరుగుపడ్డాయన్నారు. చదువు, ఇల్లు అందరికీ వచ్చినట్లు తెలిపారు. పేదల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డే నని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో దళితులపై విపరీతంగా దాడులు జరిగాయన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల జీవితాలు మెరుగుపడ్డాయన్నారు. కొండేపి నియోజకవర్గంలో మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం టిడిపి చేస్తుందన్నారు. ఆ చిచ్చులో వైసిపి కార్యకర్తలు ఎవరూ పడకుండా పనిచేయాలన్నారు. రాష్ట్ర పురపాలక పట్టణ అభివద్ధి శాఖ మంత్రి, వైసిపి కొండపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ కొండపి నియోజకవర్గంలో దళితుల మధ్య కోట గోడలు కడుతున్నారని ఆ గోడలపై చర్చించడానికి దళిత సమ్మేళనం. అంబేద్కర్‌ ఆలోచన విధానాలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. బిజెపి అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో ఉందన్నారు. తొలుత డాక్టర్‌ అంబేద్కర్‌, బాబు జగజీవన్‌ రామ్‌, వైఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొప్పోలు ఏడుకొండలు, చుక్కా కిరణ్‌ కుమార్‌ , ఎంపిపి కొండబత్తిన మాధవరావు, జడ్‌పిటిసి మన్నెం అరుణ , వినోద్‌ కుమార్‌, ఆగిపోగు దత్తు , అశోక్‌ పాల్గొన్నారు.మంత్రి నాగార్జున రాకపై చర్చశింగరాయకొండ నిర్వహించిన కొండపి నియోజకవర్గ స్థాయి దళిత ఆత్మీయ సమ్మేళానికి వైసిపి సంతనూతలపాడు నియోజక వర్గ ఇన్‌ఛార్జి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగర్జున రావడంపై వైసీపీలో చర్చ సాగింది. కొండపి నియోజకవర్గంలో మరోసారి మార్పులు ఉంటాయేమోనని ఆలోచన వైసిపిలో మొదలైంది. గతంలో ఇక్కడ పనిచేసిన జూపూడి ప్రభాకర్‌ రావు, డాక్టర్‌ మాదాసి వెంకయ్య , వరికూటి అశోక్‌ బాబును ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. వారిని ఆహ్వానించక పోవడంపై కూడా చర్చ సాగింది. ఈ కార్యక్రమానికి పొన్నలూరు ఎంపిపి మాత్రమే వచ్చారు. మిగతా మండలాల ఎంపిపిలు, జడ్‌పిటిసిలు, సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డు మెంబర్లు హాజరు కాకపోవడంపై చర్చ నడిచింది.

➡️