దాతలే ఆధారం

Dec 10,2023 21:32

 ప్రజాశక్తి -గరుగుబిల్లి  :  మండల వనరుల కేంద్రానికి నాలుగేళ్ల క్రితం దాతల సహాయంతో రంగులేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు మండల వనరుల కేంద్రానికి మెరుగులు దిద్దిన దాఖలాలు లేవు. మరమ్మతులకూ దాతలే దిక్కు. నిధుల వినియోగంపై ఉన్నతాధికారుల పరిశీలన ఏమవుతుందో, ఎందుకు ఈ విషయం పట్టించుకోవడం లేదో ఆలోచించాల్సిన విషయమేనని విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు గుసగుసలాడుతున్నారు. ప్రతి ఏటా వస్తున్న వేల రూపాయల నిధులు ఎటు పోతున్నాయో సంబంధిత అధికారులకే తెలియాలి. ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం పేరుతో పలు విడతలుగా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. నాడు-నేడు కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారులకు ఎంఆర్‌సి గురించి పట్టడం లేదు. పాఠశాలలకు రూ.లక్షల్లో నిధులు కేటాయించి, అభివృద్ధి చేసి, సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కానీ మండలంలో పాఠశాలలన్నింటికీ కేంద్రంగా ఉంటూ, ఎంఇఒ విధులు నిర్వర్తించే భవనానికి రంగుల కోసం దాతలపై ఆధారపడటం గమనార్హం. ప్రతి ఏటా వస్తున్న నిధులు ఏమవుతున్నాయో అర్థం కావడం లేదు. దాతల సహాయంతో మరమ్మతులు చేయడం తప్ప గడిచిన నాలుగేళ్లలో ఎక్కడా మండల కేంద్రానికి వచ్చిన నిధులు వినియోగించలేదు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి మండల కేంద్రానికి వచ్చిన నిధులు ఏమయ్యాయో పరిశీలన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు, మేధావులు కోరుతున్నారు.అధ్వాన స్థితిలో ఉన్న కేంద్రాలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న 34 మండల వనరుల కేంద్రాలు అధ్వాన స్థితిలో ఉన్నాయి. సిబ్బంది విధులు నిర్వహించేందుకు అననుకూలంగా ఉన్నాయని పలువురు ఉపాధ్యాయులు గుసగుసలాడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎటూ సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం అంతంతమాత్రమేనని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్‌సిలను ఆధునీకరించాలిఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న మండల వనరుల కేంద్రంలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం పద్ధతి కాదు. విద్యా రంగంలో వస్తున్న నూతన మార్పులకు అనుగుణంగా నిరంతరం శిక్షణ కల్పించేందుకు ఉపయోగించే ఈ వనరుల కేంద్రాన్ని ఆధునీకరించాలి. మౌలిక వసతులు కల్పించాలి. – బి.వి.రమణ, సిపిఎం నాయకులు

➡️