దిష్టిబొమ్మల్లా శిలాఫలకాలు

చిల్లపేట పెద్దచెరువు

అటకెక్కిన చిల్లపేట పెద్దచెరువు సుందరీకరణ..

ఎండమావిగా ట్యాంక్‌ బండ్‌ తరహా అభివృద్ధి

నాడు గంటా, నేడు ముత్తంశెట్టి హామీలు ఉత్తుత్తివే

ప్రజాశక్తి -తగరపువలస : జివిఎంసి ఒకటోవార్డు చిట్టివలస, చిల్లపేట పెద్ద చెరువును హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ తరహాలో సుందరీకరించి, అభివృద్ధి చేస్తామంటూ 2014 ఎన్నికల్లో భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గెలిచాక నాలుగేళ్లు పట్టించుకోని గంటా 2019 ఎన్నికలకు దాదాపు ఏడాది ముందే, 2018 డిసెంబర్‌ ఒకటిన రూ.కోటి 98 లక్షలతో చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చెరువు తూర్పు భాగంలో గట్టును పటిష్టవంతం చేసే పనులు పాక్షికంగా జరిగాయి. పనుల్లో తీవ్ర జాప్యం వల్ల గట్టుపై యధాతధంగా ముళ్ళ కంచెలు, పొదలు ఏపుగా పెరిగాయి. 2019లో ఎన్నికలు వచ్చేశాయి. చెరువు అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన ఉంది.2019 ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు గెలిచారు. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రిగా కూడా పని చేశారు. ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అదే శాఖ పరిధిలో టూరిజంగా అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలను వినియోగించుకోవడంలో ఒక విధంగా వైఫల్యం చెందినట్టుగానేే భావించాలి. కారణాలు ఏమైనా గానీ మంత్రి పదవి కోల్పోయాక, ఎమ్మెల్యే హోదాలో ఇదే చెరువును 25 ఎకరాల్లో ఎపి గ్రీనింగ్‌ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రూ.6కోట్ల 50 లక్షలతో సుందరీకరణ, పునరుద్ధరణ పనులకు గతేడాది జూలై ఒకటిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. యంత్రాలతో పైపైనే పూడికతీత పనులు చేపట్టారు. టిడిపి హయాంలో జరిగినట్టుగానే మళ్ళీ చెరువు గట్టును పటిష్టవంతం చేసి, పూడికతీత పనులు చేపట్టారు. పనుల్లో జాప్యం వల్ల చెరువు ప్రస్తుతం యధాస్థితిలోనే ఉంది. అభివద్ధి, సుందరీకరణ పనులు నిలిచిపోవడంతో టాంక్‌ బండ్‌ తరహా అభివృద్ధి ఉత్తిదేఅని తేలిపోయిందంటూ స్థానికులు పెదవి విరుస్తున్నారు.

దిష్టిబొమ్మల్లా శిలాఫలకాలు

➡️