దీర్ఘకాలికంగా నిలిచిన నియామకాలు

Jan 22,2024 00:43

ప్రజాశక్తి – దుగ్గిరాల : లాభాల పంట పండిస్తున్న వ్యవసాయ మార్కెటింగ్‌ యార్డు సిబ్బంది కొరతతో అల్లాడుతోంది. ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానంలో కొత్త వారిని నియమించకపోవడం, బదిలీపై వెళ్లిన వారి స్థానంలో మరొకరు రాకపోవడంతో మొత్తం పనిని పరిమిత సిబ్బంది పూర్తి చేయలేక సతమతమవుతున్నారు. ఏడాది పొడవునా క్రయ, విక్రయాలు జరిగే రెగ్యులేషన్‌ యార్డు కావడంతో ఇక్కడికి బదిపై రావడానికి ఎవ్వరూ సిద్ధమవడం లేదు. దీంతో 42 మంది సిబ్బంది ఉండాల్సిన యార్డులో ప్రస్తుతం సెక్రటరీ, ముగ్గురు సూపర్వైజర్లు, ఒక అటెండర్‌, ఒక వాచ్‌మెన్‌ మాత్రమే ఉన్నారు. మొత్తం 36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక గ్రేడ్‌-2 సెక్రెటరీ పోస్టు పదేళ్లుగా ఖాళీగా ఉండగా యూడీసీ, ఎల్డీసీ, బిట్‌ క్లర్క్‌, గ్రేడర్‌, టైపిస్ట్‌ ఒక్కొక్క పోస్టు, జూనియర్‌ మార్కెటింగ్‌ అసిస్టెంట్లు 12 పోస్టులు, వాచ్‌మెన్‌ పోస్టులు 4, అటెండర్‌ పోస్టులు 3 ఖాళీగా ఉన్నాయి. ఇంకా 13 ఔట్సోర్సింగ్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 33 మంది ఉండాల్సిన ఔట్సోర్సింగ్‌ ఉద్యోగుల్లో 20 మంది ఉన్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద యార్డుల్లో ఒకటైన రెగ్యులేటరీ మార్కెటింగ్‌ యార్డుకు ఒక్క వాచ్‌మెన్‌ మాత్రమే ఉండడం సిబ్బంది కొరత తీవ్రతకు తార్కాణంగా నిలుస్తోంది. యార్డు పరిధిలో ధాన్యం, మొక్కజొన్న పంట పండించే భూములు అధికంగా ఉన్నాయి. పంటల సీజన్‌లో చెక్‌పోస్టుల వద్ద సెస్‌ వసూలు విధులు నిర్వహించాలంటే సిబ్బంది ఏ మాత్రమూ సరిపోవడం లేదని ఉన్న సిబ్బంది వాపోతున్నారు. యార్డు పరిధిలో 140 మంది లైసెన్సు కలిగిన వ్యాపారున్నారు. నాలుగు కోల్డ్‌ స్టోరేజీలు కాకుండా పలు గోడౌన్లు యార్డు పరిధిలో ఉన్నాయి. వీటన్నింటి పర్యవేక్షణకు సరిపడా సిబ్బంది లేరు. ఈ కారణంగా పంటను నిల్వ చేసి దానిపై రుణం ఇచ్చే రైతుబంధు తరహా పథకాలనూ అమలు చేయలేకపోతున్నారు. 2023-24 సంవత్సరం గాను యార్డు ఆదాయం రూ.3.23 కోట్ల లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.2.70 కోట్లు వసూలైనట్లు తెలిసింది. మరో రెండు నెలల్లో మిగతా మొత్తాన్ని వసూలు చేయాల్సి ఉంది. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమిస్తే ఈ లక్ష్యాన్ని చేరడం పెద్ద కష్టం కాదని అంటున్నారు.

➡️